తెలంగాణ కేబినెట్ తాజాగా తీసుకున్న నిర్ణయాలు ఏమాత్రం నమ్మశక్యంగా కనిపించడం లేదు. వారం రోజులు ఫామ్ హౌజ్ లో తిష్టవేసి ప్రభుత్వంపై ఏయే వర్గాలు ఆగ్రహంతో ఉన్నాయో గుర్తించిన కేసీఆర్… కేబినేట్ నిర్ణయాలతో వారిని కూల్ చేసేలా హామీలు ఇచ్చినట్లు కనబడుతోంది. ఆర్టీసీ కార్మికులు బీఆర్ఎస్ సర్కార్ పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. జీతాల పెంపును ఆర్టీసీ కార్మికులు కోరుతున్నారు తప్పితే ప్రభుత్వంలో విలీనం చేయాలనీ ఎక్కడ డిమాండ్ చేయలేదు. వారు కూడా ఊహించని విధంగా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తున్నట్లు ప్రకటించి ఆశ్చర్యపోయేలా చేశారు.
గతంలో ఆర్టీసీ విలీనం అసంభవమన్న కేసీఆర్ ఇప్పుడు ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసేందుకు సమ్మతించడం అందర్నీ విస్తుపోయేలా చేస్తోంది. అసెంబ్లీలో తీర్మానం చేసి ప్రభుత్వంలో ఆర్టీసీని విలీనం ప్రక్రియను పూర్తి చేస్తామని కేటీఆర్ చెబుతున్నారు కానీ ఎన్నికల లోపు ఈ ప్రక్రియ పూర్తి కావడం కష్టమే. ఎన్నికల కోణంలో ఆలోచించే కేసీఆర్ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తున్నట్లు హామీ ఇచ్చినట్లు స్పష్టం అవుతోంది. హామీలను ఇవ్వడం కేసీఆర్ కు అలవాటే. ఆ హామీల పేరుతో ఓట్లు అడగడం ఆ తరువాత అటకెక్కించడం కేసీఆర్ స్టైల్.
ప్రభుత్వంపై గ్రేటర్ హైదరాబాద్ చుట్టూ పక్కల ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. బీఆర్ఎస్ సర్కార్ చేపట్టిన సర్వేలోనూ ఈ విషయం స్పష్టమైంది. ఇప్పుడు గ్రేటర్ చుట్టూ ఉన్న ప్రాంతాలను కలుపుతూ మెట్రోను విస్తరించి ఆ ప్రాంతాలను అభివృద్ధి చేసేందుకు కట్టుబడి ఉన్నట్లు మెట్రో విస్తరణ హామీ ఇచ్చారు. ఈ ప్రాజెక్టుతో గ్రేటర్ ప్రాంతాలు పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతాయని ప్రజలకు నమ్మకం కల్గించే వ్యూహంతో ఈ మెట్రో విస్తరణ ప్రకటనగా తెలుస్తోంది.
హైదరాబాద్ చుట్టూ 69వేల కోట్లతో మెట్రోను విస్తరిస్తామని మూడేళ్ళ నుంచి ఐదేళ్ళ లోపు మెట్రో సేవలు అందుబాటులోకి తెస్తామని హామీ ఇచ్చారు. అంటే ఈ హామీలు ఇప్పుడు కాదు ఎన్నికల తరువాత పట్టాలు ఎక్కుతాయి కావొచ్చు. ఇకపోతే వరద బాధితులను ఆదుకునే ఎజెండాతో సాగిన ఈ కేబినేట్ భేటీ అసంపూర్తిగా సాగింది. వరద నష్టంకు తక్షణ సాయంగా ఐదు వందల కోట్లు విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు కానీ ఎవరికీ ఎంత సాయం చేస్తారో మాత్రం చెప్పలేదు కేటీఆర్.
Also Read : కేసీఆర్ మార్క్ రాజకీయం ఈసారి బెడిసికొడుతుందా..?