ఉమ్మడి వరంగల్ రాజకీయాల్లో తమకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న కొండా కపుల్స్ కాంగ్రెస్ పార్టీని వీడనున్నారా..? తమ కుటుంబంలోని ముగ్గురికి కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్లు రావడం అసాధ్యమని అంచనా వేసి మరో పార్టీలోకి జంప్ చేయాలని నిర్ణయం తీసుకున్నారా..? అసలే అభ్యర్థులు లేక పక్క పార్టీల వైపు ఆశగా చూస్తున్న కమలం నాయకత్వం కొండా కపుల్స్ కు టికెట్లపై హామీ ఇచ్చి బీజేపీలో చేర్చుకోనుందా ..? అంటే అవుననే ప్రచారం విస్తృతంగా సాగుతోంది.
వైఎస్ హయాంలో ఓ వెలుగు వెలిగిన కొండా దంపతులు రాష్ట్రం ఏర్పడ్డాక మునుపటి ప్రభ కోల్పోయారు. కాంగ్రెస్ ను వీడి అధికార బీఆర్ఎస్ లో చేరారు. 2018లో తిరిగి కాంగ్రెస్ గూటికి చేరారు. రాజకీయ స్థిరత్వం లేకనే వీరి విషయంలో రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వం ముఖ్యమైన సమావేశాలకు ఆహ్వానించడం లేదు. మరోవైపు.. కొండా దంపతులో ఒకరికి టికెట్ ఇచ్చేందుకు కాంగ్రెస్ సుముఖంగానే ఉంది. కానీ వీరు మాత్రం ముగ్గురికి టికెట్లు ఇవ్వాలని పట్టుబడుతున్నారు. కొండా మురళితోపాటు కుమార్తె సుస్మిత కూడా రాజకీయంగా యాక్టివ్ అవుతున్నారు. దీంతో ముగ్గురు టికెట్ల కోసం ప్రయత్నిస్తున్నారు. వరంగల్ తూర్పు నుంచి మురళి, పశ్చిమ నుంచి సురేఖ , పరకాల నుంచి సుస్మిత బరిలో నిలవాలని అనుకుంటున్నారు.
కానీ ఒకే కుటుంబంలో ముగ్గురికి కాంగ్రెస్ టికెట్లు ఇచ్చే అవకాశం లేదు. దాంతో పార్టీ మారాలని కొండా కపుల్స్ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. అమిత్ షా హైదరాబాద్ టూర్ సమయంలో చర్చించి పార్టీ మారాలనే నిర్ణయాన్ని అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని అంటున్నారు.
Also Read : బీజేపీకి జిట్టా గుడ్ బై..?