బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ పై పార్టీ అధినాయకత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. పార్టీ బహిష్కరణకు గురైన గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ను ఈటల కలవడంపై హైకమాండ్ సీరియస్ అయింది. పార్టీ నుంచి సస్పెండ్ చేసిన వ్యక్తిని ఎలా కలుస్తారని, పార్టీ విధానాలకు కట్టుబడి నడుచుకోవాలని ఈటలకు హితవు పలికింది.
ఓ వర్గాన్ని కించపరిచిన కేసులో రాజాసింగ్ పార్టీకి చేటు తెచ్చేలా మాట్లాడాడని బీజేపీ సస్పెండ్ చేసింది. సస్పెన్షన్ ఎత్తివేత గడువు ముగిసినా ఆయన విధించిన బహిష్కరణపై పార్టీ ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఈ క్రమంలోనే రాజాసింగ్ తో ఈటల భేటీ కావడం హైకమాండ్ కు ఆగ్రహాన్ని తెప్పించింది.
బోనాల సందర్భంగా గోషామహల్ లో బీజేపీ – బీఆర్ఎస్ నేతల ఫ్లెక్సీ వార్ చోటుచేసుకుంది. ఈ వ్యవహారంలో మంగళ్ హాట్ బీజేపీ కార్పొరేటర్ శశికళపై పోలీసులు ఏకపక్షంగా కేసులు నమోదు చేశారని బీజేపీ ఆరోపించింది. విషయం తెలుసుకున్న ఈటల, రాజాసింగ్ నివాసంలోనున్న శశికళను పరామర్శించారు. ఈ సమయంలోనే రాజాసింగ్ తో ఈటల కాసేపు ముచ్చరించారు.
ఇదే బీజేపీ అగ్రనాయకత్వానికి ఆగ్రహాన్ని తెప్పించింది. పార్టీ నుంచి బహిష్కరణ వేటుకు గురైన నేతలతో ఎలా భేటీ అవుతారని మందలించినట్లు సమాచారం. పార్టీ విధి, విధానాలకు కట్టుబడి నడుచుకోవాలని చురకలు పెట్టినట్లు సమాచారం.
Also Read : అయ్యో పాపం.. ఈటలకు మళ్ళీ కష్టమొచ్చి పడిందే..!!