టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితో కలిసి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి బస్సు యాత్ర చేయబోతున్నారా..? ఇందుకు సంబంధించిన అంశంపై నేతలందరితో చర్చించేందుకే కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి నివాసంలో లంచ్ మీటింగ్ ఏర్పాటు చేశారా..? ఈ సమావేశం ముగిసిన అనంతరం బస్సు యాత్రపై కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ మాణిక్ రావు థాక్రే కీలక ప్రకటన చేయనున్నారా…? అంటే అవుననే సమాధానం వస్తోంది.
తెలంగాణలో ఎన్నికలకు ముహూర్తం దగ్గర పడుతున్న వేళ కాంగ్రెస్ నేతల మధ్య విబేధాలను తొలగించి ఐక్యం చేసే దిశగా ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చొరవ తీసుకున్నారు. కర్ణాటక ఎన్నికల తరువాత నాయకుల మూడ్ మాత్రమే కాదు జనాల అటెన్షన్ లో కూడా మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. దీనిని గ్రహించే పలువురు బీఆర్ఎస్ , బీజేపీ నేతలు కాంగ్రెస్ లో చేరేందుకు క్యూ కడుతున్నారు. ఈ పరిణామాలను అంచనా వేసిన కోమటిరెడ్డి ఇంకాస్త కష్టపడితే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని భావించి బస్సు యాత్ర చేసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు.
తెలంగాణలో మరో నాలుగు నెలలో ఎన్నికలు ఉన్నాయి. ఈ సమయంలో ముఖ్య నేతలంతా జనాల మధ్య ఉంటే కాంగ్రెస్ విజయం ఎవరూ అడ్డుకోలేరని, బీఆర్ఎస్ కంటే ముందంజలో కాంగ్రెస్ ఉండేలా కోమటిరెడ్డి ప్రణాళిక రచించారు. ఇందుకోసం ఎలా ముందుకు వెళ్ళాలనే అంశంపై చర్చించేందుకు హైదరాబాద్ లోని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి నివాసంలో ముఖ్య నేతలందరితో లంచ్ మీటింగ్ ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ మాణిక్ రావు థాక్రే తోపాటు సీనియర్ నేతలందరికీ కోమటిరెడ్డి ఆహ్వానం పంపారు.
ఈ భేటీలో రేవంత్ తో కలిసి బస్సు యాత్ర చేసే ఎలా ఉంటుంది..? ఏయే నియోజకవర్గాలను చుట్టేయాలి..? అనే అంశాలపై చర్చించి రూట్ మ్యాప్ ఖరారు చేయనున్నారు. అనంతరం లంచ్ మీటింగ్ లోనే అధిష్టానానికి బస్సు యాత్ర నిర్ణయాన్ని వెలువరించి పర్మిషన్ తీసుకోవాలని భావిస్తున్నారు. దాదాపుగా ఈ బస్సు యాత్రకు అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది.
రేవంత్ గతంలో చేపట్టిన యాత్ర కొన్ని కారణాలతో వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఎలాగు రేవంత్ మరికొన్ని నియోజకవర్గాలను కవర్ చేయాల్సి ఉంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో పాదయాత్ర చేస్తే సమయం సరిపోదు కనుక కోమటిరెడ్డితో కలిసి బస్సు యాత్రకే రేవంత్ మొగ్గు చూపే అవకాశం కనిపిస్తోంది.