అసంతృప్తులను కూల్ చేసేందుకు అధిష్టానం నాయకత్వ మార్పు చేసినా తెలంగాణ బీజేపీలో కల్లోలం కంటిన్యూ అవుతోంది. కేసీఆర్ అవినీతిపై బీజేపీ వైఖరి అనుమానాస్పదంగా ఉందని చంద్రశేఖర్, రవీంద్ర నాయక్ ల ప్రకటనలు దుమారం రేపిన సంగతి మరవకముందే మరో నేత అలాంటి వ్యాఖ్యలే చేశారు. బీజేపీ కీలక నేత జిట్టా బాలకృష్ణారెడ్డి మాట్లాడుతూ బీఆర్ఎస్ విషయంలో బీజేపీ సాఫ్ట్ గా వ్యవహరిస్తోందని సంచలన వ్యాఖ్యలు చేశారు.
బీజేపీకి పార్లమెంట్ స్థానాలపై మాత్రమే ఆసక్తి ఉందని…అసెంబ్లీ ఎన్నికలను లైట్ తీసుకునేలా హైకమాండ్ ఆలోచన ధోరణి ఉందని వ్యాఖ్యానించారు. పార్టీ వైఖరిలో మార్పు రావాలన్న జిట్టా వ్యాఖ్యలు కమలం పార్టీలో మరోసారి అలజడిని క్రియేట్ చేసేలా ఉన్నాయి. ఒక్కొక్కరుగా నేతలంతా అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. బీఆర్ఎస్ ను ఎదుర్కోవడం బీజేపీతో సాధ్యం కాదని…రెండు పార్టీల మధ్య అంతర్గత స్నేహం కొనసాగుతుందనే అర్థం వచ్చేలా వ్యాఖ్యలు చేస్తున్నారు.
పార్టీని వీడాలనే నిర్ణయం తీసుకునే జిట్టా బాలకృష్ణారెడ్డి ఈ కామెంట్స్ చేశారా ..? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇదే అంశంపై ఆయన స్పందిస్తూ..తాను బీజేపీలో కొనసాగుతానని.. మరికొన్నాళ్ళు వేచి చూస్తానని వ్యాఖ్యానించారు. అయితే, ఇలా నేతలంతా ఒక్కొక్కరు బీజేపీ – బీఆర్ఎస్ ఫ్రెండ్ షిప్ గురించి వ్యాఖ్యానించడం అటు బీఆర్ఎస్ – బీజేపీలకు ఇబ్బందికరమే. ఈ పరిణామాలన్నీ కాంగ్రెస్ కు మేలు చేసేలా ఉన్నాయి.