మనిలాండరింగ్ కేసులో అరెస్ట్ అయి జైలులో మగ్గుతున్న సుఖేష్ చంద్రశేఖర్ మరో సంచలన లేఖ విడుదల చేశారు. ఇదివరకు ఢిల్లీ మద్యం కుంభకోణంలో అరవింద్ కేజ్రీవాల్, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితలు లక్ష్యంగా జైలు నుంచి లేఖలు విడుదల చేసిన సుఖేష్ తాజాగా అందులో రిలీజ్ చేసిన లేఖలో కేటీఆర్ పేరును కూడా ప్రస్తావించడం కలకలం రేపుతోంది. అయితే ప్రతిసారి మీడియాకు లేఖను విడుదల చేసే సుఖేష్ ఈసారి మాత్రం ఏకంగా తెలంగాణ గవర్నర్ తమిళిసైకి పంపారు.
బీఆర్ఎస్ తప్పులు ఎక్కడ దొరుకుతాయా అని వేచిచూస్తోన్న తమిళిసై ఇప్పుడు ఆ లేఖ ద్వారా ఎలాంటి చర్యలు తీసుకుంటారోనన్నది ఆసక్తికరంగా మారింది. తమిళిసై కి సుఖేష్ పంపిన లేఖలో పలు విషయాలను ప్రస్తావించారు. దాదాపు రూ. 200కోట్ల లావాదేవీలకు సంబంధించిన ఆధారాలు తన దగ్గర ఉండటంతో తన వద్ద ఉన్న ఆధారాలు ఇవ్వాలని కేటీఆర్, కవిత అనుచరులు ఒత్తిడి తెస్తున్నారని లేఖలో ప్రస్తావించారు. ఆధారాలు ఇస్తే తనకు అసెంబ్లీ సీట్ ఇస్తామని ఆఫర్ చేస్తున్నట్లు పేర్కొన్నారు. తనతో కవిత చేసిన వాట్సప్ చాట్ రికార్డింగ్ ఉందన్న సుఖేష్…వాటిని ఈడీకి ఇచ్చినట్లు చెప్పారు.
సుఖేష్ గవర్నర్ కు పంపిన లేఖ ఒక్కసారిగా కలకలం రేపింది. విషయం కేటీఆర్ కు చేరడంతో సోషల్ మీడియా వేదికగా ఘాటుగా రియాక్ట్ అయ్యారు. అతనిపై లీగల్ యాక్షన్స్ తీసుకుంటానని హెచ్చరించారు. నోటెడ్ క్రిమినల్స్ ఇలాంటి ఆరోపణలు చేసినప్పుడు, పబ్లిష్ చేసేటప్పుడు అప్రమత్తంగా ఉండాలన్నారు. మొదటిసారి కేటీఆర్ లక్ష్యంగా సుఖేష్ ఆరోపణలు చేయడంతో బీఆర్ఎస్ నేతలు కుట్రకోణం ఉందని ఆలోచిస్తున్నారు.
Also Read : లిక్కర్ స్కామ్ లో కీలక పరిణామం- వాట్సప్ చాట్ తో దొరికిపోయిన కవిత