మంత్రి హరీష్ రావుతో గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. ఆయనపై ఏడాది కిందట బీజేపీ విధించిన సస్పెన్షన్ ఇంకా ఎత్తివేయలేదు. ఈ క్రమంలోనే హరీష్ రావుతో రాజాసింగ్ సమావేశమవ్వడం అనేక అనుమానాలకు తెరలేపింది. పార్టీ తనపై విధించిన సస్పెన్షన్ కాలపరిమితి ముగిసినా బీజేపీ నుంచి పాజిటివ్ రెస్పాన్స్ రావడం లేదు. అంతేకాదు ఇటీవల అద్యక్షుడిగా నియమకమైన కిషన్ రెడ్డితో రాజాసింగ్ కు గ్యాప్ ఉంది. దాంతో ఆయన పార్టీ మారేందుకు సిద్దమై హరీష్ తో భేటీకి ఆసక్తి చూపారన్న ప్రచారం జరిగింది.
హరీష్ రావుతో భేటీ ముగిసిన అనంతరం భేటీకి గల కారణాలను రాజాసింగ్ వెల్లడించారు. నియోజకవర్గ అభివృద్ధికి నిధుల కోసమే హరీష్ రావును కలిశానని చెబుతున్నారు. గోశామహల్ ఉన్న హాస్పిటల్‌ను 30 పడకలు లేదా 50 పడకలుగా అభివృద్ధి చేయాలని మంత్రిని కోరినట్లు చెప్పారు. తాను ఎమ్మెల్యేగా గెలిచిన నాటి నుండి ఆసుపత్రి కోసం అడుగుతూనే ఉన్నానన్నారు. ఇప్పటి వరకూ ఇద్దరు ఆరోగ్య శాఖ మంత్రులను కలిశానని.. తాను కలిసిన మూడో మంత్రి హరీష్ రావు అని రాజాసింగ్ తెలిపారు.
పార్టీ మారేందుకు సిద్దమై హరీష్ రావుతో భేటీ అయ్యారా..? అనే ప్రశ్నకు రాజాసింగ్ ఆసక్తికర సమాధానం ఇచ్చారు. తాను బీజేపీలోనే కొనసాగుతానని పార్టీ మారే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. బీజేపీ సస్పెన్షన్ ఎత్తివెయ్యకపోతే రాజకీయ సన్యాసం చేస్తాను కానీ పార్టీ మారబోనని స్పష్టం చేశారు. బీజేపీలో ఉంటా.. బీజేపీ కార్యకర్తగానే మరణిస్తానని పేర్కొన్నారు. హిందూ దేశం కోసం తన పోరాటం కొనసాగుతుందని రాజాసింగ్ తెలిపారు.