దక్షిణ తెలంగాణపై పూర్తిగా పట్టు సాధించిన కాంగ్రెస్ ఇప్పుడు ఉత్తర తెలంగాణపై ఫోకస్ పెట్టింది. కరీంనగర్ , నిజామాబాద్ జిల్లాల్లో పార్టీ బలోపేతంపై దృష్టిసారించిన రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వం ఈ రెండు జిల్లాలో చేరికలను ప్రోత్సహించాలని భావిస్తోంది. ఇందుకోసం బీఆర్ఎస్ కు ధీటైన అభ్యర్థులను కాంగ్రెస్ లోకి లాగేందుకు ప్రణాళికలు రచించిన కాంగ్రెస్ ఆ దిశగా సక్సెస్ అయినట్లు సమాచారం. ఈసారి ఇందూర్ జిల్లాలో అత్యధిక సీట్లను కైవసం చేసుకోవాలనే బలమైన నేతలను కాంగ్రెస్ లో చేర్చుకోనున్నారు.
నిజామాబాద్ లో బీఆర్ఎస్ కు ధీటుగా బీజేపీ విస్తరించినా ఆ పార్టీ గడిచిన కొన్నాళ్ళుగా చతికిలపడింది. ఇందూర్ లో ఆ పార్టీకి పెద్దదిక్కుగా కనిపించిన ధర్మపురి అరవింద్ మునుపటిలా అగ్రెసివ్ గా వ్యవహరించడం లేదు. దీంతో బీజేపీ క్యాడర్ కూడా కాంగ్రెస్ వైపు చూస్తోంది. అలాగే , ప్రభుత్వ వ్యతిరేక ఓటు బ్యాంక్ కాంగ్రెస్ వైపు టర్న్ అవుతోంది. దీంతో ఆయా పార్టీలోని పలువురు అసంతృప్త నేతలు, తటస్థ నేతలు కాంగ్రెస్ లో చేరేందుకు మొగ్గు చూపుతున్నారు. ఇప్పటికే ఆరెంజ్ ట్రావెల్స్ అధినేత ముత్యాల సునీల్ రెడ్డి కాంగ్రెస్ లో చేరడం ఖాయమైంది. ఆయనకు బాల్కొండ బెర్త్ కన్ఫాం అయింది.
ఆర్మూర్ నుంచి పొద్దుటూరు వినయ్ రెడ్డి , నిజామాబాద్ అర్బన్ నుంచి బీఆర్ఎస్ నేత డాక్టర్ శివప్రసాద్ , రూరల్ నుంచి వేముల రాధిక రెడ్డి కాంగ్రెస్ లో చేరేందుకు నిర్ణయించినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ లో చేరాలనే ఆలోచనతోనే ఆమె తన ఉద్యోగానికి రాజీనామా చేశారు. వీరితోపాటు మాజీ మంత్రి మండవ వెంకటేశ్వరరావును పార్టీలో చేర్చుకునే దిశగా కాంగ్రెస్ పావులు కదుపుతోంది. మరోవైపు బీసీ సామజిక వర్గానికి చెందిన ఆకుల లలిత బీఆర్ఎస్ నుంచి టికెట్ దక్కకపోతే ఆమె కాంగ్రెస్ లో చేరెందుకు రెడీ అయ్యారు.
వీరంతా ఈ నెల 20న జరగనున్న సభలో ప్రియాంక గాంధీ సమక్షంలో కాంగ్రెస్ లో చేరుతారా..? లేక ఢిల్లీ వెళ్లి రాహుల్ గాంధీ సమక్షంలో కండువా కప్పుకుంటారా..? అన్నది తేలాల్సి ఉంది.
Also Read : తుంగతుర్తిలో గ్రూప్ రాజకీయాలకు చెక్ – కాంగ్రెస్ అభ్యర్థిగా మహిళా నేతకు ఛాన్స్..?