కాంగ్రెస్ గల్లీలో లేదు, ఢిల్లీలో లేదని ఇన్నాళ్ళు ఎగతాళి చేస్తూ వచ్చిన కేటీఆర్…తాజాగా అదే పార్టీకి చెందిన రాష్ట్ర అద్యక్షుడు రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను వక్రీకరించి రోడ్డు మీదకు వచ్చారు. ఉచిత కరెంట్ రేవంత్ వద్దన్నారని ధర్నాలు చేశారు. కాంగ్రెస్ గల్లీలో కూడా లేనప్పుడు రేవంత్ వ్యాఖ్యలను బీఆర్ఎస్ అంత సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం ఏంటి..? ఓ అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీపై ధర్నాలు చేయడం అందర్నీ ఆశ్చర్యపరిచింది.
కాంగ్రెస్ అధికారంలో లేదు. మరోసారి తమదే అధికారమని కేటీఆర్ ధీమాగా చెబుతున్నారు. అయినప్పటికీ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మూడు గంటలు మాత్రమే కరెంట్ ఇస్తారని కేటీఆర్ వ్యాఖ్యానించడం కొత్త చర్చకు తెరలేపింది. ఈ లెక్కన వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుపుపై కేటీఆర్ కు ఆశలు సన్నగిల్లాయా..? అనే ప్రశ్న తెరపైకి వచ్చింది. అసలు కాంగ్రెస్ అధికారంలోకి రాదనీ అంత ధీమా కేటీఆర్ కు ఉన్నప్పుడు కాంగ్రెస్ ప్రకటనలపై ధర్నాలు చేయాల్సిన అవసర ఏమొచ్చింది ..? మూడు గంటలు కరెంట్ ఇస్తారని రైతులను రెచ్చగొట్టాల్సిన అవసరం ఏంటి..? అనే అనుమానం అందరిలో కల్గుతోంది.
బీఆర్ఎస్ రోడ్డు మీదకు ఎక్కడంతో బీఆర్ఎస్ కు ఎంత మైలేజ్ వచ్చిందో కానీ, 24గంటల విద్యుత్ తో కేసీఆర్ చేస్తోన్న దోపిడీపై పెద్ద ఎత్తునే చర్చ జరిగింది. ఇది బీఆర్ఎస్ కు ఇబ్బందికరమైనదే. కాంగ్రెస్ కూడా ప్రతిగా ఆందోళనలు చేస్తోంది. పోరాటం ఓ రేంజ్ లో ఉండేలా జాగ్రత్త పడుతున్నారు. అమెరికాలో ఉన్న రేవంత్ రెడ్డి వచ్చాక ఈ అంశంపై మరింత రెచ్చిపోనున్నారు. విద్యుత్ ఒప్పందంలో అవకతవకలను రేవంత్ వివరించనున్నారు. ఇవన్నీ బయటకు వస్తే బీఆర్ఎస్ కు ఇబ్బందే.
మొత్తంగా…రేవంత్ చేసిన వ్యాఖ్యలను వక్రీకరించి కేటీఆర్ అత్యుత్సాహం ప్రదర్శించి నిరసనలకు పిలుపునిచ్చారు. ఇలా చేయడం వలన బీఆర్ఎస్ రైతులకు చేసిన మేలు ఏంటి..? బీఆర్ఎస్ రైతు రుణమాఫీ చేయకపోవడంతోపాటు బీఆర్ఎస్ వైఫల్యాలు బయటకు వచ్చాయి. 24గంటల కరెంట్ ఇవ్వడం లేదనే చర్చ మరోసారి తెరమీదకు రావడంతో బీఆర్ఎస్ పై రైతుల వ్యతిరేకత పెరిగింది. ఎలా చూసినా కాంగ్రెస్ ను ఎవగించుకోవాలని కేటీఆర్ చేసిన ప్రయత్నాలు బెడిసికొట్టాయి.
Also Read : ఆషాడం ముగియగానే అసెంబ్లీ రద్దు – కాంగ్రెస్ ను దెబ్బతీసే లక్ష్యంతో కేసీఆర్..?