తుంగతుర్తి నియోజకవర్గ కాంగ్రెస్ లో గ్రూప్ రాజకీయాలకు చెక్ పెట్టే దిశగా రాష్ట్ర నాయకత్వం అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. రెండుసార్లు స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి పాలైన కాంగ్రెస్ వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా తుంగతుర్తిలో విజయం సాధించాలని టార్గెట్ పెట్టుకుంది. ఇందుకోసం ఏ గ్రూప్ లు లేని, ఆరోపణలు లేని, క్లీన్ ఇమేజ్ కల్గిన కొత్త నేతకు అవకాశం ఇవ్వాలని భావిస్తోంది.
ఇప్పటికే కాంగ్రెస్ అభ్యర్థుల జాబితాలో అద్దంకి దయాకర్, జ్ఞాన సుందర్, వడ్డేపల్లి రవితోపాటు ఎస్సీ సెల్ చైర్మన్ నగరిప్రీతం పీర్లు ఉన్నాయి. తుంగతుర్తి కాంగ్రెస్ టికెట్ మాదంటే మాదేనని ఎవరికీ వారు ధీమాగా ఉన్నారు. పార్టీ పిలుపునిచ్చినా కార్యక్రమాలను సమన్వయము చేసుకుంటూ ఐక్యంగా సాగాలసిన ఈ నలుగురు నేతలు ఎవరికీ వారుగా నిర్వహిస్తున్నారు. ఇది పార్టీలో చీలికలకు దారితీస్తోంది. పరిస్థితిని అంచనా వేసిన రాష్ట్ర నాయకత్వం టికెట్ ఆశవాహులను పిలిచి మాట్లాడినా నేతల మధ్య సఖ్యత కనిపించలేదు. విసిగిపోయిన రాష్ట్ర నాయకత్వం కొత్త నేత కోసం వేట ప్రారంభించింది.
తెలంగాణ యూనియన్ జర్నలిస్ట్ గా ఉద్యమ నేతగా తనదైన గుర్తింపు పొందిన ఇస్మాయిల్ భార్య కృష్ణవేణి పేరు అనూహ్యంగా తెరమీదకు వచ్చింది. కొన్నాళ్ళుగా నియోజకవర్గంలో కృష్ణవేణి ఫౌండేషన్ పేరుతో సేవా కార్యక్రమాలు చేస్తున్న ఇస్మాయిల్ – కృష్ణవేణి దంపతులు వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నారు. వీరి సేవా కార్యక్రమాలతో ప్రజల్లో మంచి ఆదరణ సంపాదించారు. పైగా దళిత, సామజిక మాధ్యమాల్లో విద్యార్ధి నేతగా కృష్ణవేణి కీలక పాత్ర పోషించారు. జర్నలిస్ట్ గా పని చేసిన అనుభవం కూడా ఆమెకు ఉంది. ఇదే కృషవేణి గెలుపుకు దోహదం చేస్తాయని ఇస్మాయిల్ నమ్మకంగా ఉన్నారు.
కృష్ణవేణి ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారు..? అనేది పూర్తిగా స్పష్టత రాలేదు. నియోజకవర్గంలో కృష్ణవేణి ఫౌండేషన్ తో చేపట్టిన సేవా కార్యక్రమాలు కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వాన్ని ఆకర్షించాయి. దాంతో కృష్ణవేణి – ఇస్మాయిల్ దంపతులను పిలిచి మాట్లాడినట్లు తెలిసింది. కృష్ణవేణికి తుంగతుర్తి టికెట్ పై హామీ ఇచ్చారా..? లేదా అన్నది తెలియదు కానీ అవకాశం ఇస్తే కాంగ్రెస్ నుంచి పోటీ చేసేందుకు ఆసక్తిగా ఉన్నారు.
కృష్ణవేణికి అవకాశం ఇవ్వడం ద్వారా కాంగ్రెస్ కు మేలు జరుగుతుందని లెక్కలు వేసుకుంటున్నారు. ఎందుకంటే అద్దంకి దయాకర్ కు టికెట్ ఇస్తే వడ్డేపల్లి రవి వర్గం సపోర్ట్ చేసే అవకాశం లేదు. ముఖ్యంగా దామోదర్ వర్గీయులు అద్దంకి ఓటమి లక్ష్యంగా పని చేయనున్నారు. అలా కానీ పక్షంలో వడ్డేపల్లి రవికి టికెట్ ఇచ్చినా అద్దంకి వర్గీయులు సపోర్ట్ చేసే అవకాశం లేదు అందుకే మద్యే మార్గంగా కృష్ణవేణికి టికెట్ ఇస్తే అందర్నీ కలుపుకుపోతారని అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. చూడాలి మరి ఏం జరుగుతుందో..!!
Also Read : ఝాన్సీరెడ్డి రాకతో మకాం మార్చుతోన్న ఎర్రబెల్లి..?