తెలంగాణలో ఎన్నికలకు సమాయత్తం అవుతోన్న కాంగ్రెస్ లో ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరనే చర్చ విస్తృతంగా కొనసాగుతోంది. సీనియర్లు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, భట్టి విక్రమార్క, జగ్గారెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి వంటి చాలామంది నేతలు తాము కూడా ముఖ్యమంత్రి అభ్యర్థులమేనని ప్రకటిస్తుండగా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందంటే ఏం చేయడానికైనా సిద్దంగా ఉన్నానని వ్యాఖ్యానించారు.
అవసరమైతే సీతక్కను ముఖ్యమంత్రి చెస్తామని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు రేవంత్. అమెరికాలో జరిగిన తానా సభల్లో భాగంగా కాంగ్రెస్ అధికారంలోకి వస్తే దళితులు, గిరిజనులకు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలని రేవంత్ ను కోరారు. ఇందుకు స్పందించిన రేవంత్… కాంగ్రెస్ అన్ని వర్గాలకు న్యాయం చేస్తుంది. అవసరమైతే సీతక్కను కూడా ముఖ్యమంత్రి చేస్తామని ప్రకటించారు. సీనియర్ నేతల వ్యాఖ్యలకు చెక్ పెట్టేందుకే రేవంత్ ఈ కామెంట్స్ చేశారా..? లేక సీతక్కను సీఎం చేయాలనే ఆలోచన హైకమాండ్ పార్టీలో ఉన్నదా..? అనే చర్చ జరుగుతోంది ఇప్పుడు.
మరోవైపు రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు వ్యూహాత్మకం అనే చర్చ జరుగుతోంది. ఎందుకంటే రాష్ట్రంలో మహిళల ఓటు బ్యాంక్ బీఆర్ఎస్ వైపు ఉన్నది. ఆ ఓటు బ్యాంక్ ను కాంగ్రెస్ వైపు బదలాయించేందుకు మహిళా సీఎం అభ్యర్థిత్వం అంశాన్ని రేవంత్ తెరపైకి తీసుకోచ్చారన్న విశ్లేషణలు వ్యక్తం అవుతున్నాయి. కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకొచ్చేందుకు రేవంత్ తెలివిగా రాజకీయాలు చేస్తున్నారని… రేవంత్ సమయస్పూర్తికి తోడు సీనియర్ల సహకారం తోడైతే కాంగ్రెస్ ను అధికారంలోకి రాకుండా ఎవరూ ఆపలేరన్న వాదనలు క్రమంగా బలపడుతున్నాయి.
Also Read : కాంగ్రెస్ ‘చేయూత’ ఎఫెక్ట్ – పెన్షన్ పెంచేందుకు కేసీఆర్ సై..?