తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిని మార్చుతున్నారని తెలియగానే మారోసారి బిగ్ బాంబ్ పేల్చారు దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు. పార్టీ అద్యక్షుడిని మార్చడంపై స్పందించిన ఆయన అదంతా సంజయ్ స్వయంకృతాపరాధమన్నారు. ప్రస్తుతం బీజేపీ బలీయంగా ఉండటం వెనక తన గెలుపు బలం ఉందని వ్యాఖ్యానించారు.
తాను బీజేపీ గుర్తుపై గెలవలేదని తన చరిష్మాతోనే గెలిచానని చెప్పారు. మునుగోడులో వంద కోట్లు ఖర్చు పెట్టినా పార్టీ విజయం సాధించలేదని గుర్తు చేసిన రఘునందన్ రావు..ఆ వందకోట్లను తనకు ఇచ్చి ఉంటే తెలంగాణను దున్నేసేవాడినని చెప్పారు. పార్టీలో రఘునందన్, ఈటలలు ఉంటేనే బీజేపీకి భవిష్యత్ అని వ్యాఖ్యానించిన రఘునందన్…మా బొమ్మలను చూసే ఓట్లేస్తారని అన్నారు. పుస్తెలు అమ్మి ఎన్నికల్లో పోటీచేసిన బండి సంజయ్‌కి వంద కోట్లు పెట్టి యాడ్స్ ఇచ్చేంత డబ్బు ఎక్కడిదని ప్రశ్నించిన ఆయన పార్టీ డబ్బులో తనకు కూడా వాటా ఉందని అన్నారు.
పార్టీకి శాసన సభ పక్ష నేత లేడనే విషయం నడ్డాకు తెలియదన్నారు. ఆ విషయమై తాను నడ్డాను ప్రశ్నిస్తే అవునా అంటూ తననే తిరిగి ప్రశ్నించాడని తెలిపారు రఘునందన్. నడ్డాపై మోడీకి ఫిర్యాదు చేస్తానని సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీలో తనకు సముచిత స్థానం కల్పించలేదని కొంతకాలంగా అసహనంగా ఉన్న రఘునందన్ ఢిల్లీ వెళ్లి అక్కడే తేల్చుకోవాలని అనుకున్నారు.
హస్తిన వెళ్ళిన ఆయన పార్టీ నేతలతో భేటీ అనంతరం పదేళ్ల నుంచి పార్టీ కోసం పని చేస్తున్న తాను అధ్యక్ష పదవిని ఎందుకు ఆశించవద్దని ప్రశ్నించారు. పార్టీ అధ్యక్ష పదవి, ఫ్లోర్ లీడర్, జాతీయ అధికార ప్రతినిధి.. ఈ మూడు పదవుల్లో ఏదో దానిని తనకు ఇవ్వాలన్నారు. కొన్ని విషయాల్లో తన కులమే తనకు శాపమమైందని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
Also Read : టి. బీజేపీ ప్రెసిడెంట్ రేస్ – కిషన్ రెడ్డి, డీకే అరుణల మధ్య పోటీ..?