ఇప్పటికే అనేక అటుపొట్లను ఎదుర్కొంటున్న బీజేపీకి తాజాగా షాక్ ఇచ్చారు ఎమ్మెల్యే రఘునందన్ రావు. ఓ వైపు అసంతృప్తులను ఒక్కొక్కరిని పిలిచి బుజ్జగిస్తూ పార్టీని హైకమాండ్ గాడిన పెడుతోన్న వేళ.. పార్టీలో తనకు తీవ్రమైన అన్యాయం జరుగుతోందని రఘునందన్ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి.
తన గెలుపుతోనే పార్టీలో ఊపు వచ్చిందని.. తాను దుబ్బాకలో గెలిచి ఉండకపోతే ఈటల బీజేపీలో చేరేవాడా..? అని ప్రశ్నించారు. అలాంటి తనను పార్టీ హైకమాండ్ పరిగణనలోకి తీసుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.రఘునందన్ రావు కొన్ని రోజులుగా పార్టీ ఆఫీసు వైపే చూడటం లేదు. నియోజకవర్గానికే పరిమితమై రాజకీయాలు చేస్తున్నారు. పార్టీలో అసంతృప్తులు ఒక్కొక్కరు తమ స్వరాన్ని వినిపిస్తోన్న సమయంలో రఘునందన్ కూడా అసంతృప్తిని వెళ్లగక్కారు. పార్టీ తన సేవలను గుర్తించడం లేదని పెదవి విరిచారు.
రాజాసింగ్ పై పార్టీ సస్పెన్షన్ వేటు వేయడంతో బీజేపీ అసెంబ్లీ ఫ్లోర్ లీడర్ పదవి ఖాళీగా ఏర్పడింది. దాంతో ఈ పదవిని తనకు అప్పగించాలని రఘునందన్ కొన్నాళ్ళుగా కోరుతున్నారు. కానీ రఘునందన్ విజ్ఞప్తిని రాష్ట్ర నాయకత్వం కానీ, జాతీయ నాయకత్వం కానీ పట్టించుకోలేదు. జాతీయ, రాష్ట్ర రాజకీయాలపై మంచి పట్టున్న రఘునందన్ రావు బీజేపీ జాతీయ అధికారి ప్రతినిధి పదవి కూడా ఆశించాడు. ఈ పదవి కూడా ఆయనకు దక్కలేదు.
తన కంటే తరువాత పార్టీలో చేరిన నేతలకు జాతీయ ఎగ్జిక్యూటివ్ పదవిని కట్టబెట్టిన అధినాయకత్వం.. సీనియర్ అయిన తనకు మాత్రం మొండిచేయి చూపుతుందని రఘునందన్ తన సన్నిహితుల వద్ద అసహనం వ్యక్తం చేశాడు. రాష్ట్ర ప్రభుత్వ అవినీతిపై మాట్లాడుతుండటంతో తనకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయని జాతీయ నాయకత్వం దృష్టికి తీసుకెళ్ళినా పట్టించుకోకపోవడంతో రఘునందన్ సైలెంట్ అయి ఒక్కసారిగా బ్లాస్ట్ అయ్యారు.
ఈ నేపథ్యంలోనే బీజేపీకి రఘునందన్ రావు గుడ్ బై చెప్తారని జోరుగా ప్రచారం జరుగుతోంది. బీజేపీని వీడితే ఆయన సొంత గూటికి చేరుతారా ..? లేక కాంగ్రెస్ లో చేరుతారా..? అనే చర్చలు అప్పుడే ప్రారంభమయ్యాయి. ఇప్పటికే ఆయనతో బీఆర్ఎస్ నేతలు టచ్ లోకి వచ్చారని త్వరలోనే బీఆర్ఎస్ గూటికి చేరి.. చేరికల విషయంలో బీఆర్ఎస్ కూడా స్పీడ్ పెంచానుందని అంటున్నారు.
కీలక నేతను బీఆర్ఎస్ లో చేర్చుకొని అటు బీజేపీ , ఇటు కాంగ్రెస్ ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయాలనే వ్యూహంతో గులాబీ బాస్ ఉన్నారన్న వాదనలు వినిపిస్తున్నాయి.
Also Read : వైఎస్సార్ కు నటితో రెండో పెళ్లి – సోషల్ మీడియాను ఊపేస్తోన్న వార్త..!!