సానా సతీష్ బాబు…కొటారి సోమేశ్వరరావు. ఇద్దరు ప్రాణ స్నేహితులు. చిన్నప్పటి నుంచి కలిసిమెలిసి పెరిగారు. పెరిగి పెద్దయాక ఎవరు జీవితాల్లో వారు బిజీ అయిపోయారు. ఇంతలోనే తన స్నేహితుడు కొటారి సోమేశ్వరరావు అకాల మరణం చెందాడన్న వార్త విని చలించిపోయాడు. తన ఆప్త మిత్రుడి పిల్లలు అనాధలు కాకూడదని తలచి వారి భవిష్యత్ చక్కదిద్దే బాధ్యత తీసుకొని సానా సతీష్ బాబు ఎంతోమందికి ఆదర్శంగా నిలిచాడు.
అప్పటికే తల్లి మరణంతో అమ్మ ప్రేమకు దూరమైన సోమేశ్వరరావు పిల్లలు తాజాగా తండ్రి కూడా మరణించడంతో ఏ దిక్కుమొక్కు లేని అనాధలా మారారు. ఈ విషయం తెలియడంతో ఎలాగైనా తన స్నేహితుడి పిల్లలను ఆదుకోవాలని భావించాడు. ఏ స్వార్ధం చూసుకోకుండా మనసు గెలిచిన స్నేహితుల బాగోగుల కోసం శ్రమించే స్వభావం ప్రస్తుత సమాజంలో అరుదుగానే కనిపిస్తోంది. అలాంటి అరుదైన వ్యక్తుల్లో సానా సతీష్ బాబు ఒకరు.
కాకినాడకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త సానా సతీష్ బాబు అందరికీ సుపరిచితులే. సతీష్ బాబు ఫౌండేషన్ ఏర్పాటు చేసి ఎంతోమందికి చేయూతనందిస్తున్నారు. అయితే… తాను అంచలంచెలుగా ఎదిగినప్పటికీ తన స్నేహితులను మాత్రం మరిచిపోలేదు సతీష్ బాబు. తన ప్రాణ స్నేహితుడు కొటారి సోమేశ్వరరావు అకాల మరణం చెందాడని తెలుసుకొని వెంటనే ఇంటికి వెళ్లి తల్లితండ్రి లేని అనాధలుగా మారిన తన మిత్రుడి కుమారుడు, కుమార్తెలను పరామర్శించాడు.తన స్నేహితుడితో చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తు చేసుకొని కన్నీటి పర్యంతమయ్యాడు.
కొటారి సోమేశ్వరరావుకు కె లేఖనా (9), కెవిఆర్ ప్రసాద్(14) ఇద్దరు పిల్లలు. కుటుంబ పెద్ద అయిన సోమేశ్వర్ రావు మృతితో ఆ పిల్లల చదువు ప్రశ్నార్ధకంగా మారింది. దాంతో తన స్నేహితుడి పిల్లల విద్యా ఖర్చులను తన ట్రస్ట్ తరపున భరిస్తానని సతీష్ బాబు హామీ ఇచ్చారు. ప్రస్తుతం అమ్మమ్మ, తాతల పర్యవేక్షణలో ఉంటున్న ప్రసాద్, లేఖనా భవిష్యత్ భరోసా తనదని హామీ ఇచ్చాడు సతీష్ బాబు.