ఎన్నికలను బీజేపీ ఎంత సీరియస్ గా తీసుకుంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎన్నికలకు మరో ఆరు నెలల సమయం ఉండగానే ప్రచారాన్ని ప్రారంభిస్తారు. అగ్రనేతల పర్యటనలతో పార్టీలో ఎన్నికల కోలాహలం కనిపిస్తోంది. ఇప్పుడు మాత్రం మునుపటి సీన్ కు భిన్నంగా కనిపిస్తోంది. త్వరలోనే ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల నగారా మోగనుంది. మధ్యప్రదేశ్, చత్తీస్ ఘడ్, రాజస్తాన్ , తెలంగాణలోనే ఎన్నికలు జరగనున్నాయి. నాలుగు రాష్ట్రాలను ఇప్పటికే రెండు, మూడు రౌండ్లు చుట్టేసిన అగ్రనేతలు తెలంగాణలో మాత్రం పర్యటనలను వాయిదా వేసుకుంటున్నారు.
వాస్తవానికి జూన్ లో ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా లు తెలంగాణలో పర్యటించాల్సి ఉన్నది. తుఫాన్ కారణంగా అమిత్ షా పర్యటన వాయిదా పడింది. మోడీ పర్యటన కూడా వాయిదా పడింది కానీ కారణాలు వెల్లడి కాలేదు. జూలై రెండో వారంలో అగ్రనేతలు తెలంగాణాకు వస్తారని అనుకుంటున్నారు. వరంగల్ లో సభ నిర్వహించాలని ఇందుకు ప్రధానిని పిలవాలని ఆశ పడుతున్నారు. ఆలోపు పార్టీలో ఎవైన కీలక పరిణామాలు చోటుచేసుకునే అవకాశం కూడా ఉంది. అదే జరిగితే ప్రధాని పర్యటన రద్దయ్యే అవకాశం మెండుగా ఉంది.
కర్ణాటక ఎన్నికల రిజల్ట్ రాకముందు వరకు తెలంగాణపై బీజేపీ అగ్రనాయకత్వం గంపెడు ఆశలు పెట్టుకుంది కానీ తరువాత కాంగ్రెస్ లోకి వలసలు పెరుగుతున్నాయి. దీంతో క్రమక్రమంగా హైకమాండ్ కూడా ఆశలు వదిలేసుకుంటుంది. రాష్ట్ర నాయకత్వం అభ్యర్ధన మేరకు వివిధ రాష్ట్రాలకు చెందిన 600 మంది బీజేపీ బూత్ కమిటీ సభ్యులను తెలంగాణకు తీసుకు వస్తున్నారు. కానీ వేరే రాష్ట్రాలకు చెందిన నేతలతో బీజేపీకి పెద్దగా ఉపయోగం ఉండదు. అగ్రనేతలు వచ్చి ప్రచారం చేసినా ఎన్నికల్లో పార్టీ చావు దెబ్బతింటే అది పార్లమెంట్ ఎన్నికల నాటికీ ఇబ్బంది అవుతుందని హైకమాండ్ ఆందోళన.
Also Read : మోడీ, అమిత్ షా ల మధ్య గ్యాప్ – ఎందుకంటే..?