తెలంగాణ కాంగ్రెస్ లో జోష్ కనిపిస్తోంది. అధికారమే లక్ష్యంగా సాగుతోంది. చేరికలతో పార్టీకి కావాల్సిన బూస్ట్ లభించింది. ఈ సమయంలో అందర్నీ సమన్వయము చేసుకుంటూ సాగాల్సిన సీనియర్ నేత పార్టీలో గందరగోళానికి తెరలేపాడు. ఆయన ఎవరో కాదు టీపీసీసీ మాజీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి. పార్టీలో కొత్త చిచ్చు రాజేసేందుకు నేను రెడీ అనేలా సంకేతాలు ఇచ్చేశారు. తనపై పార్టీలో దుష్ప్రచారం చేస్తున్నారని మీడియా ముందే ఓపెన్ అయ్యాడు.
పార్టీలో మునుపెన్నడూ కనిపించని జోష్ ప్రస్తుతం కనిపిస్తుండగా పార్టీ సీనియర్ నేతగా కాస్త బాధ్యతతో, సంయమనంతో వ్యవహరించాలి. కానీ ఆయన మాత్రం అంతర్గత విషయాలను మీడియా ముందే మాట్లాడుతున్నారు. పార్టీ ఎంత బలంగా మారినా బలహీనపరిచే చర్యలను ఉత్తమ్ మానుకోవడం లేదన్న విమర్శలను మూటగట్టుకుంటున్నారు. ఇప్పటికే ఉత్తమ్ పై బీఆర్ఎస్ కోవర్ట్ అన్న ముద్ర ఉంది. ఈ సమయంలో ఆయనపై జరుగుతున్న దుష్ప్రచారాన్ని పార్టీలో జరిగే అంతర్గత వేదికలపై చర్చించుకొని సరిదిద్దుకోవాలి. ఆయన మాత్రం ఇందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు.
తన రాజకీయ వారసుడిని బీఆర్ఎస్ లోకి పంపింది కూడా ఉత్తమేననే ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడు ఆయన కూడా బీఆర్ఎస్ కు పరోక్షంగా మద్దతుగా నిలుస్తున్నారని..పోలిసుల సహాయంతో కాంగ్రెస్ సోషల్ మీడియాను బద్నాం చేస్తున్నారని కాంగ్రెస్ వర్గాలే ఉత్తమ్ వ్యవహారాలను తప్పుబడుతున్నాయి. తనపై జరుగుతోన్న దుష్ప్రచారాన్ని స్ట్రాటజీ మీటింగ్ లో తేల్చుకుంటానని స్పష్టం చేసిన ఉత్తమ్ ఏమేం మాట్లాడుతారనే చర్చ జరుగుతోంది. మొత్తానికి కాంగ్రెస్ పార్టీని కిందకు ఎవరో లాగాల్సిన పని లేదు సొంత పార్టీ నేతలే చాలు అనే అభిప్రాయాలకు ఉత్తమ్ తీరుతో బలం చేకూరినట్లు అయింది.
ఉత్తమ్ తీరుతో ఆయనకు, పార్టీకి ఎంతమేరకు లాభం జరుగుతుందో కానీ బీఆర్ఎస్ కు మాత్రం దండిగానే మైలేజ్ పెరుగుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
Also Read : కాంగ్రెస్ పార్టీకి, ఎంపీ పదవికి ఉత్తమ్ రాజీనామా – బీఆర్ఎస్ లో చేరిక ఎప్పుడంటే..?