వైఎస్ షర్మిల వైఎస్సార్ టీపీని కాంగ్రెస్ లో విలీనం చేయబోతున్నారని ప్రచారం జరుగుతోన్న నేపథ్యంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. రెండు రోజుల్లో తన తల్లి విజయమ్మతో కలిసి వైఎస్ షర్మిల ఢిల్లీ వెళ్లనున్నట్లు సమాచారం. సోనియా గాంధీతో భేటీ అయ్యేందుకే షర్మిల ఢిల్లీ వెళ్తున్నారని తెలుస్తోంది. ఈ భేటీ అనంతరం షర్మిల రాజకీయ భవితవ్యంపై మరింత క్లారిటీ రానుంది.
షర్మిల సేవలను ఏపీలో ఉపయోగించుకోవాలని హైకమాండ్ భావిస్తోంది. కానీ షర్మిల మాత్రం తెలంగాణలోనే తన రాజకీయం కొనసాగుతుందని స్పష్టం చేయడంతో…వైఎస్సార్ టీపీ విలీనం అంశం మళ్ళీ మొదటికి వచ్చినట్లు కనబడుతోంది. టి. కాంగ్రెస్ నేతలు కూడా షర్మిలను ఏపీకి పంపాలని పట్టుబడుతున్నారు. కోమటిరెడ్డి లాంటి నేతలు మాత్రం షర్మిలను తెలంగాణలో ఉంచాలని కోరుతున్నారు.
ఏపీలో షర్మిల రాజకీయం చేసేందుకు అంగీకరిస్తే ఆమెకు పీసీసీ పగ్గాలు అప్పగించేందుకు హైకమాండ్ కూడా సిద్దంగా ఉంది. ఏపీ కాంగ్రెస్‌లో క్రియాశీలక పాత్ర పోషించేందుకు షర్మిల ఒకే చెప్తే ప్రస్తుతం వైసీపీలోనున్న కొంతమంది మళ్లీ సొంతగూటికి వచ్చే అవకాశాలు లేకపోలేదని భావిస్తున్నారు. తద్వారా ఏపీలో పార్టీ పునరుజ్జీవం పోసుకుంటుందని అగ్రనేతల ఆలోచన.
ఏపీలో పూర్వవైభవం కోసం పార్టీ శతవిధాల ప్రయత్నిస్తోంది. పీసీసీలను మార్చినా ఫలితం ఉండటం లేదు. ప్రస్తుతం గిడుగురాజు రుద్రరాజు చేతిలో ఏపీ కాంగ్రెస్ పగ్గాలున్నాయి. ఆయన వచ్చాక కూడా పార్టీలో ఊపు కనిపించడం లేదు. ఈ పరిస్థితుల్లో షర్మిలను కాంగ్రెస్ లో చేర్చుకొని ఏపీకి పంపించి పార్టీకి పూర్వ వైభవం తేవాలని పార్టీ ఆలోచిస్తోంది. షర్మిలను ఏపీకి పంపాలని చూస్తున్న హైకమాండ్ బుజ్జగింపులకు షర్మిల లొంగుతుందా లేదా..? చూడాలి.