బీఆర్ఎస్ – బీజేపీల మధ్య ఉద్రిక్త వాతావరణం సడలిపోవడంతో రెండు పార్టీలకు ఆదరణ క్రమంగా తగ్గిపోతోంది. ముఖ్యంగా బీజేపీ రెండేళ్ళుగా సంపాదించిన హైప్ కొట్టుకుపోతోంది. లిక్కర్ స్కామ్ కేసులో కవితను అరెస్ట్ చేస్తారని హడావిడి జరిగినా చివరికి దర్యాప్తు సంస్థలు సైలెంట్ అయ్యాయి. దీంతో రెండు పార్టీల మధ్య అవహగన కుదిరిందన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఇవే కాంగ్రెస్ కు అస్త్రంగా మారాయి. బీజేపీపై యుద్ధం ప్రకటించిన కేసీఆర్ పాట్నాలో జరిగిన విపక్షాల భేటీకు హాజరు కాలేదు. ఈ సమావేశం జరిగిన రోజునే మంత్రి కేటీఆర్ కేంద్ర హోం మంత్రి అమిత్ షా తో భేటీ కావడం హాట్ టాపిక్ అయింది.
అమిత్ షా తో భేటీ అనంతరం విపక్షాల భేటీపై మంత్రి కేటీఆర్ స్పందిస్తూ.. కలవాల్సింది పార్టీలు కాదు ప్రజలని సందేశం ఇచ్చారు. కలవాల్సిందే ప్రజలే అయితే గతంలో కేసీఆర్ విపక్ష పార్టీలతో భేటీకి ఎందుకు ఆరాటపడ్డారన్న ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి. మొత్తంగా బీఆర్ఎస్ – బీజేపీల మధ్య ఏదో అండర్ స్టాండింగ్ కుదిరిందన్న వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. కేసీఆర్ , కేటీఆర్ లు గత కొన్నాళ్ళుగా బీజేపీపై విమర్శల వేడిని తగ్గించి కాంగ్రెస్ ను టార్గెట్ చేస్తున్నారు. బీజేపీపై కేసీఆర్ యుద్ద విరమణ రాజకీయ అవసరమే అయినా దీని వలన రెండు పార్టీలు నష్టపోతున్నాయి.
ఈ పరిణామం కాంగ్రెస్ పార్టీకి ఉపయుక్తంగా మారింది. బీజేపీ – బీఆర్ఎస్ లు ఒకటేనని అనుమానాలు ఉండగానే కర్ణాటక ఎన్నికల ఫలితంతో కాంగ్రెస్ దూకుడు పెంచింది. బీఆర్ఎస్ అసంతృప్త నేతలు, బీజేపీలోని వలస నేతలు ఆయా పార్టీలను వీడి కాంగ్రెస్ గూటికి చేరేందుకు సిద్దం అవుతున్నారు. మరికొద్ది రోజుల్లో రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకునే అవకాశం ఉన్నాయి. మొత్తంగా కేసీఆర్ స్ట్రాటజీ ఈసారి బోల్తా కొట్టే అవకాశం ఉంది. బీజేపీపై కేసీఆర్ గాండ్రించి ఇప్పుడు తోక ముడవడంతో ఇదే రెండు పార్టీలకు మైనస్ అయింది.
Also Read : కేసీఆర్ విమర్శలే బీజేపీకి బలమా..?