వైసీపీ ఎమ్మెల్యేలతో ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి సమావేశమయ్యారు. ఈ సమావేశంలో గడప, గడపకు ప్రభుత్వం అనే కార్యక్రమంపై చర్చించిన జగన్…ఎమ్మెల్యేల పనితీరుపై ప్రశాంత్ కిషోర్ టీమ్ అందించిన నివేదిక గురించి వివరించారు. 15మంది ఎమ్మెల్యేల పనితీరు ఏమాత్రం బాగోలేదని చెప్పిన జగన్, పని తీరు మెరుగు పర్చుకోవాలని ఆ పదిహేను మందికి సూచించారు.
అయితే ఆ పదిహేను మంది ఎమ్మెల్యేలు ఎవరనేది మాత్రం జగన్ గోప్యంగా ఉంచారు. గతంలో పనితీరు బాగోలేని ఎమ్మెల్యేల పేర్లు చదివి వినిపించిన జగన్ ఈసారి మాత్రం పదిహేను మంది ఎమ్మెల్యేల వర్క్ బాగోలేదని చెప్పారు తప్పితే పేర్లు మాత్రం బయటకు వెల్లడించలేదు. వారికే సీఎంవో ఆఫీసు నుంచి సర్వే నివేదికను పంపిస్తామని వెల్లడించారు. నివేదిక ఆధారంగా ఎక్కడ వెనకబడుతున్నారో గుర్తించి ప్రజలకు చేరువ కావాలని ఎమ్మెల్యేలకు సూచించారు.
ఎమ్మెల్యేల పనితీరు బాగుంటేనే వచ్చే ఎన్నికల్లో టికెట్లు వస్తాయని మరోసారి స్పష్టం చేశారు జగన్. సర్వే నివేదికల ఆధారంగా టికెట్ లు ఇస్తామని.. ఇందులో ఎవరికీ మినహాయింపు ఉండదని స్పష్టం చేశారు. పని తీరు మెరుగుపరుచుకోకపోతే టికెట్ ఇచ్చేది లేదని.. ఆ తరువాత తనను నిందిస్తే ఏం చేయలేనని ఎమ్మెల్యేలను కోరారు. అయితే ప్రజాభిమానం కోల్పోయిన ఆ పదిహేను మంది ఎమ్మెల్యేలు ఎవరన్నది ఇప్పుడు చర్చనీయాంశం అవుతోంది.