తెలంగాణలో అధికారమే లక్ష్యంగా కాంగ్రెస్ హైకమాండ్ తన వ్యూహాలకు మరింత పదును పెడుతోంది. ఓ వైపు కీలక నేతలను పార్టీలో చేర్చుకునేలా వ్యూహం అనుసరిస్తూనే మరోవైపు వైఎస్సార్ తెలంగాణ పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసుకునే దిశగా శరవేగంగా పావులు కదుపుతోంది. కాసేపటి క్రితమే వైఎస్ షర్మిల భర్తకు ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ ఫోన్ చేసినట్లు పార్టీ విశ్వసనీయ వర్గాల సమాచారం. అనిల్ తో సోనియా, రాహుల్ పర్యటన గురించి తెలిపినట్లు తెలుస్తోంది.
మంగళవారం లేదా బుధవారం సోనియా గాంధీ వైఎస్ షర్మిల, విజయమ్మతో మాట్లాడుతారని కేసీ వేణుగోపాల్ చెప్పినట్లు తెలుస్తోంది. అలాగే జూలై ఎనిమిదిన వైఎస్సార్ జయంతి సందర్భంగా సోనియా, రాహుల్ గాంధీలు ఇడుపులపాయకు వచ్చి వైఎస్సార్ ఘాట్ వద్ద నివాళులర్పించనున్నట్లు తెలుస్తోంది. జగన్ టార్గెట్ గా వ్యూహాలను కాంగ్రెస్ హైకమాండ్ సిద్దం చేస్తోంది. ఏపీలో కాంగ్రెస్ పార్టీ పునరుజ్జీవం దిశగా అడుగులు వేస్తోంది.
రాహుల్ గాంధీని ప్రధాని చేయాలన్న తన తండ్రి కలను సాకారం చేసే దిశగా వైఎస్ షర్మిల అడుగులు వేస్తున్నారు. షర్మిల పార్టీలో కాంగ్రెస్ లో విలీనం చేసుకోవడం ద్వారా వైఎస్సార్ అభిమానుల ఓటు బ్యాంక్ ను తిరిగి పొందవచ్చుననేది పార్టీ పెద్దల ఆలోచన. ప్రస్తుతం తెలంగాణ వేదికగా షర్మిల రాజకీయాలు చేసినా రేపోమాపో ఆమెను ఏపీ వేదికగా రాజకీయాలు చేసేందుకు ఒప్పించే అవకాశం ఉందని అంటున్నారు.
ఇడుపులపాయ వేదికగానే వైఎస్ షర్మిల తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించనున్నట్లు సమాచారం. ఈ విషయమై మరో వారం రోజుల్లో మరింత స్పష్టత రానుంది.
Also Read : కాంగ్రెస్ లో వైఎస్సార్ టీపీ విలీనానికి షర్మిల మొగ్గు..!?