పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణారావుతో కలిసి నాగర్ కర్నూల్ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కూచకుళ్ల దామోదర్ రెడ్డి తనయుడు రాజేష్ రెడ్డి కాంగ్రెస్ లో చేరే అవకాశం కనిపిస్తోంది. రాజేష్ రెడ్డి రాజకీయ భవిష్యత్ కు బాటలు వేయాలని యోచిస్తున్న అయన తండ్రి దామోదర్ రెడ్డి కుమారుడి కోసం తనవంతు ప్రయత్నాలు చేస్తున్నారు. రాజేష్ రెడ్డి భవిష్యత్ కు కాంగ్రెస్ నుంచి ఆశాజనకమైన హామీ లభిస్తే దామోదర్ రెడ్డి కూడా బీఆర్ఎస్ ను వీడెందుకు రెడీ అయ్యారని తెలుస్తోంది.
రాజేష్ రెడ్డి కాంగ్రెస్ లో చేరేకంటే ముందుగానే దామోదర్ రెడ్డి బీఆర్ఎస్ కు రాజీనామా చేస్తారని నాగర్ కర్నూల్ జిల్లాలో ప్రచారం జరుగుతోంది. ఇదే జరిగితే జిల్లాలో బీఆర్ఎస్ కు వచ్చే ఎన్నికల్లో ఇబ్బందికర పరిణామాలు తప్పవు. దామోదర్ రెడ్డి పార్టీని వీడితే ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయని సీఎం కేసీఆర్ పర్యటనకు ఒకరోజు ముందే స్థానిక ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డి, కూచకుళ్ళ దామోదర్ రెడ్డితో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఇద్దరి మధ్య వాడివేడిగా చర్చ జరిగినట్లు అనుచరులు చెబుతున్నారు.
తన అనుచరులను అణగదొక్కుతున్నారని మర్రిపై దామోదర్ రెడ్డి ఫైర్ అయినట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే కూచకుళ్ళ రాజేష్ రెడ్డి కాంగ్రెస్ లో చేరుతానని నిర్ణయం తీసుకోవడం పట్ల ఆయన తండ్రి స్వాగతించారని అంటున్నారు. తన కుమారుడిని కాంగ్రెస్ లోకి పంపి దామోదర్ రెడ్డి తరువాత తన ఎమ్మెల్సి పదవికి రాజీనామా చేసే యోచనలో దామోదర్ రెడ్డి ఉన్నారని తెలుస్తోంది.