కర్ణాటక ఎన్నికల ఫలితం తెలంగాణ బీజేపీపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఇన్నాళ్ళు ఎలాగోలా బీజేపీ తెచ్చిపెట్టుకున్న హైప్ కర్ణాటక ఫలితంతో ఒక్కసారిగా తుడిచిపెట్టుకుపోయింది. అధికారం ఉన్నచోటనే పార్టీ తిరిగి అధికారంలోకి రాలేకపోయింది. ఇక అంతంత మాత్రం ఆశలున్నా తెలంగాణలో ఎలా సాధ్యం అవుతుందని..? పెదవి విరుపులు ప్రారంభమైయ్యాయి. ఈ నేపథ్యంలోనే చాలా మంది నేతలు కమలం కాంపౌండ్ నుంచి గాంధీ భవన్ లోకి దూకేందుకు రెడీ అయినట్లు తెలుస్తోంది.
పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణారావులు జూన్ రెండో వారంలో కాంగ్రెస్ చేరనున్నారు. వారితోపాటు నల్గొండ జిల్లాకు చెందిన బీఆర్ఎస్ నేతలు కూడా ఒకరిద్దరు కాంగ్రెస్ లో చేరుతారని ప్రచారం జరుగుతోంది. బీజేపీ నేతలు కూడా కాంగ్రెస్ లో చేరుతారని..వారిలో మాజీ ఎంపీలు జితేందర్ రెడ్డి, వివేక్ , కొండా విశ్వేశ్వర్ రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిలు ఉన్నారని అంటున్నారు. ప్రస్తుతం ఈ నలుగురు నేతలతో కాంగ్రెస్ సంప్రదింపులు జరుపుతోందని విస్తృతస్థాయి ప్రచారం జరుగుతోంది.
కాంగ్రెస్ , బీఆర్ఎస్ నుంచి కేసీఆర్ వ్యతిరేక నేతలు బీజేపీలో చేరడంతో కమలం కాస్త కట్టుదిట్టంగా మారింది తప్ప, తెలంగాణలో బీజేపీ బలంగా ఏమి మారలేదనే నిర్ణయానికి కొంతమంది వచ్చినట్లు తెలుస్తోంది. కేసీఆర్ ను గద్దె దింపాలని భావిస్తున్న నేతలంతా కలిసి ఉమ్మడిగా కాంగ్రెస్ లో చేరితే కాంగ్రెస్ వేవ్ లో బీఆర్ఎస్ గల్లంతు కావడం ఖాయమని… ఎందుకంటే తెలంగాణ ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్ కు గుర్తింపు ఉంది. గ్రామాల నుంచి కూడా కాంగ్రెస్ కు కార్యకర్తల బలం ఉంది.
అందుకే కేసీఆర్ వ్యతిరేక నేతలంతా కలిసి కాంగ్రెస్ లో చేరితే కేసీఆర్ ను ఫామ్ హౌజ్ కు పరిమితం చేయవచ్చునని బీజేపీలోని కొంతమంది నేతలు భావిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుత నేతలంతా ఒకేసారి బీజేపీని వీడితే మళ్ళీ ఎన్నికల నాటి స్థితికి బీజేపీ చేరుకుంటుందని అభిప్రాయపడుతున్నారు.