మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి సొంత గూటికి చేరనున్నారా..? సోమవారం ఈటల చేసిన వ్యాఖ్యలతో తెలంగాణలో బీజేపీ బలపడే అవకాశం లేదనే నిర్ణయానికి వివేక్ వచ్చేశారా..? పొంగులేటి, జూపల్లి బాటలోనే వివేక్ కాంగ్రెస్ పార్టీ గూటికి చేరాలనే సమాలోచనలు చేస్తున్నారా..? అంటే అవుననే సమాధానం వస్తోంది.
మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావులు బీజేపీలోకి వచ్చే పరిస్థితి లేదని సోమవారం ఈటల చేసిన వ్యాఖ్యలు బీజేపీలో ప్రకంపనలు రేపుతున్నాయి. బీజేపీలో రాష్ట్ర నాయకత్వంపై అసంతృప్తిగానున్న నేతలను పక్కచూపులు చూసేలా ఉన్నాయని పొలిటికల్ ఏనలిస్టులు అభిప్రాయపడుతున్నారు. బీఆర్ఎస్ బహిష్కరణ వేటుకు గురైన ఇద్దరు నేతలను బీజేపీలో చేరాలని చేరికల కమిటీ చైర్మన్ ఈటల విశ్వప్రయత్నాలు చేశారు కానీ పొంగులేటి, జూపల్లి సహా మరికొంతమంది నేతలు బీజేపీలో చేరేందుకు సుముఖంగా లేరు. దీనిని గుర్తించిన ఈటల… వారిని బీజేపీలో చేరేలా ప్రయత్నించాను.. కానీ వారే తమతో జత కట్టాలంటూ తనకు కౌన్సిలింగ్ ఇస్తున్నారని కామెంట్స్ చేయడం పలువురు నేతలను ఆలోచనలో పడేశాయి.
ఈ నేపథ్యంలోనే మాజీ ఎంపీ వివేక్ కాంగ్రెస్ తీర్ధం పుచ్చుకునేందుకు రెడీ అయ్యారని ప్రచారం జరుగుతోంది. కేసీఆర్ ను గద్దె దించడం బీజేపీతో సాధ్యం కాదని..కలిసికట్టుగా కేసీఆర్ వ్యతిరేకులంతా కాంగ్రెస్ లో చేరితే బీఆర్ఎస్ ను ఓడించడం సాధ్యం అవుతుందని ఆయన విశ్వసిస్తున్నట్లు చెబుతున్నారు. పైగా.. బండి ఒంటెత్తు పోకడలు చాలామంది నేతలకు నచ్చడం లేదు. బీఆర్ఎస్ , కాంగ్రెస్ నుంచి పార్టీలో చేరిన నేతల సేవలను ఆయన వినియోగించుకునేందుకు బండి అనాసక్తి చూపిస్తున్నారని అసంతృప్తిగా ఉన్నారు. పైగా… తాను పోటీ చేయాలనుకుంటున్నపెద్దపల్లి జిల్లాలో బీజేపీతో పోలిస్తే కాంగ్రెస్ బలంగా ఉండటం…వీటన్నింటిని పరిగణనలోకి తీసుకొని కాంగ్రెస్ లో చేరాలని వివేక్ నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు.
కాంగ్రెస్ లో చేరే విషయమై రేవంత్ రెడ్డితో వివేక్ చర్చలు కూడా పూర్తి అయ్యాయని.. అవసరమైతే జూన్ రెండున లేదా పొంగులేటి, జూపల్లితోపాటు కాంగ్రెస్ లో చేరుతారని సోషల్ మీడియా వేదికగా విస్తృత ప్రచారం జరుగుతోంది. దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. వివేక్ కాంగ్రెస్ లో చేరితే కాంగ్రెస్ కు ఓ మీడియా ఛానెల్ సపోర్ట్ కూడా దొరికినట్లేనని కాంగ్రెస్ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.