2018ఎన్నికల్లో మ్యానిఫెస్టో రూపకల్పనలో ఆలస్యం కావడంతో ఆ అంశాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్ళడంలో టి.కాంగ్రెస్ వెనకబడింది. అది కూడా తమ ఓటమికి ఓ కారణమని కాంగ్రెస్ నేతలు చెప్పిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఈసారి ఎన్నికల్లో అలాంటి పొరపాట్లు జరగకుండా జాగ్రత్తపడుతోంది కాంగ్రెస్. ఇందుకోసం ఓటర్లను ఆకర్షించేందుకు ఇప్పటికే రైతు, యూత్ డిక్లరేషన్ ను ప్రకటించిన కాంగ్రెస్ మరో ఏడు డిక్లరేషన్ లను ప్రకటించనుంది.
పీసీసీ చీఫ్ రేవంత్ లక్కీ నెంబర్ 9 కలిసివచ్చేలా మొత్తం తొమ్మిది డిక్లరేషన్ లతో కాంగ్రెస్ మ్యానిఫెస్టోను రూపొందించనున్నారు. రైతు, యూత్ డిక్లరేషన్ లకు తోడు త్వరలోనే బీసీ డిక్లరేషన్ ప్రకటించి ఆ తరువాత మహిళ డిక్లరేషన్ కూడా ప్రకటించాలని రేవంత్ నిర్ణయించారు. ఇప్పటికే ఇందుకు సంబంధించిన డిక్లరేషన్ ను తయారు చేసే పనిలో పడింది టి. కాంగ్రెస్ రాజకీయ వ్యూహకర్త సునీల్ కనుగోలు టీం.
కర్ణాటకలో రూపొందించిన మ్యానిఫెస్టోను ప్రజల్లోకి తీసుకెళ్ళడంతో అక్కడ పార్టీ సక్సెస్ అయింది. తెలంగాణలో కూడా సాధ్యమైనంత ముందుగా మ్యానిఫెస్టోను తయారు చేసి హామీలను ప్రజల్లోకి తీసుకెళ్ళి ఓట్లు రాబట్టుకోవాలని కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వం భావిస్తోంది. తెలంగాణలో ప్రకటించిన హామీల అమలుకు రాష్ట్ర నేతలు మాత్రమే కాదు పార్టీ అగ్రనేతలైన రాహుల్, ప్రియాంక గాంధీలు కూడా గ్యారెంటీగా ఉంటారని…వారి చేతే డిక్లరేషన్ లను ప్రకటించనున్నారు.