కేసీఆర్ ఏ పథకం రూపొందించినా అది ప్రజలను ఆకట్టుకునేలా ఉంటుందనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అమలు తరువాత పథకం పేరు చెప్పి ప్రచారం చేసుకొని లబ్ది పొందటంలో కేసీఆర్ మించిన రాజకీయ నేత మరెవరూ లేరంటే అతిశయోక్తి కాదేమో. ఇప్పుడు అలాంటి ప్రయత్నమే ప్రారంభించారు కేసీఆర్.
దళిత బంధు ద్వారా దళితులకు పది లక్షలు ఇస్తున్నారు. బీసీ పథకం ద్వారా కుల వృత్తుల వారికీ రూ. లక్ష ఇవ్వాలని నిర్ణయించారు. తాజాగా ఇళ్ల నిర్మాణం కోసం మూడు లక్షలు ఇవ్వాలని నిర్ణయించారు. కొత్తగా ఇళ్ల పథకానికి ఈ ఏడాది రూ. 18వేల కోట్లను ఖర్చు చేస్తామని చెబుతున్నారు. దీంతో ప్రభుత్వంపై మరింత భారం పడుతుంది. నిరుద్యోగ భ్రుతిపై హామీని నెరవేర్చాలని ప్రశ్నిస్తే ఖజానే లేదు ఎక్కడి నుంచి ఇవ్వాలని ఓపెన్ స్టేట్ మెంట్ పాస్ చేసిన ప్రభుత్వ పెద్దలు…ఇప్పుడు అంత మొత్తాన్ని ఎక్కడి నుంచి ఇస్తారు అనేది చర్చనీయాంశం అవుతోంది.
నిజంగా అర్హులైన వారందరికీ మూడు లక్షలు ఇస్తారా..? అనేది తెలియాల్సి ఉంది. కానీ ప్రభుత్వ ప్రచారం మాత్రం మామూలుగా లేదు. గతంలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళ పథకాన్ని ప్రారంభించినప్పుడు ..సొంత జాగ ఉన్నోళ్ళకు ఐదు లక్షల ఆర్ధిక సాయం అందిస్తామని హామీ ఇచ్చారు. పార్టీ మ్యానిఫెస్టోలో చేర్చారు. కానీ అమలు చేయలేదు. బడ్జెట్ లో నిధులు కేటాయించారు. కాని ఒక్కపైసా విడుదల చేయలేదు.
ఇప్పుడు ఎన్నికలు రాబోతున్నాయి కనుక గృహలక్ష్మి పథకం అమలు జరుగుతుందని అంటున్నారు. అర్హుల వద్ద నుంచి దరఖాస్తులను స్వీకరించాలని ఆదేశించారు. అంటే అందరి దగ్గర దరఖాస్తులు తీసుకుంటారు. ఈ ప్రక్రియ మొదలయ్యేలోపు ఎన్నికలు నోటిఫికేషన్ వస్తుంది. ఆలోపు కొంతమందికి ఇస్తారు మిగతా వారికీ ఎన్నికల అనంతరం ఇస్తామని హామీ ఇచ్చి ఓట్లు వేయించుకోవాలనే ఆలోచనతో ప్రభుత్వ పెద్దలు ఉన్నట్లు తెలుస్తోంది.