బీజేపీలో ఈటల రాజేందర్ వ్యవహారశైలి దయనీయంగా మారుతోంది. పార్టీ రాష్ట్ర అద్యక్ష బాధ్యతలను ఆశిస్తోన్న ఈటల తనను టీ. బీజేపీ చీఫ్ గా నియమించాలని హస్తిన వెళ్లి శతవిధాల ప్రయత్నాలు చేశారు. ఆయనకు కొంతమంది నేతలు కోరస్ పాడారు. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో బండిని మార్చే ప్రసక్తే లేదని అగ్రనేతలు స్పష్టం చేయడంతో…ఈటల తన బలాన్ని చూపించి అధిష్టానంకు తనేంటో తెలియజేయాలని చూస్తున్నారన్న వాదనలు సర్వత్ర ఆసక్తి రేపుతున్నాయి.
తెలంగాణ రాజకీయాలను పొంగులేటి,జూపల్లి చేరికలు ప్రభావితం చేస్తాయని కాంగ్రెస్,బీజేపీలు భావిస్తున్నాయి. పొంగులేటి,జూపల్లిని పార్టీలో చేర్చుకోవాలని ఢిల్లీ నుంచిబీజేపీ నేతలకు ఆదేశాలు అందాయి. బండి రంగంలోకి దిగినా ఫలితం లేకుండా పోయింది. ఈటల కూడా ఓసారి తన టీంను వెంటబెట్టుకొని వెళ్లి పొంగులేటి కలిసారు. బీజేపీలో చేరాలని కన్విన్స్ చేసే ప్రయత్నం చేశారు. ఇప్పుడు ఢిల్లీ నుంచి వచ్చాక పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణారావులతో హైదరాబాద్ శివారులోని ఓ ఫామ్ హౌస్ సీక్రెట్ గా సమావేశం అయ్యారు.
కర్ణాటక ఎన్నికల ఫలితం తరువాత పొంగులేటి కాంగ్రెస్ లోకి వెళ్లేందుకు సిద్దమయ్యారని కోడై కూస్తున్న వేళ పొంగులేటితో ఈటల భేటీ కావడం చర్చకు దారితీసింది. బీజేపీలో ప్రాధాన్యత పెంచుకునేందుకు పొంగులేటిని బీజేపీలో చేరాలని ఆహ్వానించడానికి వెళ్ళారా..? లేక పార్టీలో తనకు ప్రాధాన్యత దక్కడం లేదని,అద్యక్ష బాధ్యతలు ఇవ్వరనే అసంతృప్తికి గురై అందరూ కలిసి కాంగ్రెస్ లో చేరే విషయమై చర్చించేందుకు రహస్యంగా కలిశారా..?అన్న ప్రశ్న ఇప్పుడు తెలంగాణ రాజకీయాలను ఊపేస్తోంది.
కొత్తగా చేరే వారికి ముఖ్యంగా ఈటల రాజేందర్ చర్చలు జరిపి చేరే వారికి ఎలాంటి హామీలు ఇవ్వడం లేదు. బండి సంజయ్ కూడా.. ఈటలకే గ్యారంటీ లేని పరిస్థితుల్లో వారికి బీజేపీ తరపున ఎలాంటి హామీ ఇచ్చే అవకాశం లేదని.. అందరూ కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరడమో, లేదా కొత్త పార్టీ పెట్టడమో అన్న ఆలోచనలు చేస్తున్నారని అంటున్నారు.