బండి సంజయ్ ను తెలంగాణ బీజేపీ అద్యక్ష బాధ్యతల నుంచి తప్పించేది లేదని స్పష్టం చేసిన బీజేపీ అధినాయకత్వానికి అసంతృప్తులు ఝలక్ ఇచ్చారు. బండిని తప్పించకపోతే తమ దారి తాము చూసుకుంటామని హైకమాండ్ కు అల్టిమేటం విధించారు. బండి స్థానంలో ఈటలకు అద్యక్ష బాధ్యతలు అప్పగించి…కేసీఆర్ కుటుంబ అవినీతిపై విచారణకు ఆదేశించాలని హైకమాండ్ వద్ద అసంతృప్తులు తమ వాణిని గట్టిగా వినిపించినట్లు తెలుస్తోంది.
ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కవిత పాత్రకు సంబంధించి ఆధారాలు ఉన్నా అరెస్ట్ చేయడంలో జాప్యం ఎందుకు జరుగుతుందని..ఈడీపై రాజకీయ ఒత్తిళ్ళు ఉన్నాయా..? అని ప్రశ్నించినట్లు సమాచారం. కేసీఆర్ అవినీతిపై విచారణకు ఆదేశించకుండా పదేపదే ఆరోపణలు చేయడం వలన తెలంగాణలో బీజేపీకి నైతికత లేకుండా పోతుందని హైకమాండ్ పెద్దల ముందు ఆవేదన వ్యక్తం చేసినట్లు కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి తన అనుచరులతో చెప్పినట్టు ప్రచారం జరుగుతున్నది.
తనను తిరిగి కాంగ్రెస్ లోకి రావాలని కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ ఆహ్వానించారని అనుచరుల వద్ద ప్రస్తావించినట్లు తెలుస్తోంది. అయితే,ఇప్పటికప్పుడు పార్టీ మార్పుపై ఎలాంటి హామీ ఇవ్వలేదని బీజేపీలో ప్రక్షాళన లేకుండా ఉంటే ఆలోచిస్తానని చెప్పినట్లు తెలిసింది. ఇటీవల ఢిల్లీలో ఈటల,కొండా విశ్వేశ్వర్ రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిలు బీజేపీ అగ్రనేతలతో సమావేశమై టి.బీజేపీ భవితవ్యంపై నివేదిక అందించారు.
తెలంగాణ వంటి ప్రగతిశీల రాష్ట్రంలో మతతత్వ రాజకీయాలతో ఓ పార్టీ అధికారంలోకి వస్తుందని భావించడం అమాయకత్వమేనని..బండి సంజయ్ ఇదే ధోరణితో సాగుతున్నారని చెప్పినట్లు తెలుస్తోంది. మతతత్వ రాజకీయాలు చేస్తే ప్రజల నుంచి వ్యతిరేకత ఎదుర్కోవాల్సి వస్తుందని తెలిపినట్లు సమాచారం. బండి ఏకపక్ష వైఖరితో ముందుకు సాగుతున్నారని బండిని మార్చి ఆయనకు మరో గౌరవప్రదమైన పదవిని కట్టబెట్టాలని చెప్పినట్లు వినికిడి. జూన్ చివరి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోకపోతే తమ మరో దారిని ఎంచుకోవాల్సి వస్తుందని అసంతృప్తులు స్పష్టం చేసినట్లు సమాచారం.