బీఆర్ఎస్ -బీజేపీ మధ్య మ్యాచ్ ఫిక్సింగ్ కుదిరిందా..? ఒప్పందంలో భాగంగానే బీజేపీపై దాడిని కేసీఆర్ తగ్గించారా..? ఫలితంగానే ఎమ్మెల్సి కవిత లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ గండం నుంచి సేఫ్ అయ్యారా..? అంటే అవుననే సమాధానం వస్తోంది.
ఢిల్లీ మద్యం కుంభకోణంలో ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీస్ సిసోడియాతో సహా అందరూ అరెస్ట్ అయ్యారు. అరెస్ట్ అయిన వారెవరికీ బెయిల్ రావడం లేదు. ఈ స్కాంలో కవిత పాత్ర ఉందని…ఈ స్కాం ద్వారా వచ్చిన లాభాలతో కవిత బినామి భూములను కొన్నారని ఈడీ సాక్ష్యాలను కోర్టుకు సమర్పించింది. ఆమె పాత్ర ఉందని సౌత్ గ్రూప్ లో ఆమె కీలకమని ఈడీ స్పష్టం చేసింది. దాంతో కవిత అరెస్ట్ ఖాయమని అంత భావించారు కానీ, ఆమెను ఇంతవరకు అరెస్ట్ చేయలేదు.
లిక్కర్ స్కాం కేసులో ఇప్పటికే నాలుగుసార్లు కవితను ఈడీ ప్రశ్నించింది. ఆమె దగ్గరి నుంచి పది ఫోన్లను కూడా తీసుకున్నారు. మళ్ళీ విచారణకు పిలుస్తామని కవితకు ఈడీ అధికారులు నోటిసులు కూడా ఇచ్చారు. కానీ ఇంతవరకు మళ్ళీ కవితను విచారణకు పిలవలేదు. లిక్కర్ స్కాం కేసులో అందర్నీ అరెస్ట్ చేసిన ఈడీ, కవితకు మాత్రం ఎవరి ఒత్తిళ్ళ మేరకు మినహాయింపు ఇచ్చిందనేది చర్చనీయాంశం అవుతోంది.
కవితను లిక్కర్ స్కాంలో అరెస్ట్ కాకుండా బీఆర్ఎస్ పెద్దలు చక్రం తిప్పారన్న వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. ఇదే భావనను కేసీఆర్ ను బలంగా వ్యతిరేకించే కొంతమంది బీజేపీ నేతలు చెబుతుండటం గమనార్హం. కర్ణాటక ఎన్నికల్లో ప్రచారం చేస్తామని బీఆర్ఎస్ వెనక్కి తగ్గడం..మహారాష్ట్రలో శివారు ప్రాంతాలకే పరిమితం కావడంతో లిక్కర్ స్కాంలో ఎదో గుడుపుఠాని జరిగిందన్న సందేహాలకు బలం చేకూరుతోంది.
బీజేపీకి మేలు చేయడానికే కేసీఆర్ ఈ స్టాండ్ తీసుకున్నారన్న ప్రచారం జరుగుతోంది. ఓ వైపు ఢిల్లీ లిక్కర్ స్కాం దర్యాప్తు నెమ్మదించడం, బీజేపీపై కేసీఆర్ దాడిని తగ్గించడంతో బీజేపీ, బీఆర్ఎస్ ల మధ్య క్విడ్ ప్రోకో జరిగిందన్న ప్రచారం గుప్పుమంటుంది.