ఈవారం కొత్త పలుకులో ఏబీఎన్ ఆర్కే ఆసక్తికరమైన విషయం వెల్లడించారు. పీసీసీ చీఫ్ గా వైఎస్ షర్మిలకు బాద్యతలు కట్టబెడుతారని ఇందుకు సంబంధించిన వ్యవహారాలన్నీ పూర్తి అయ్యాయని రాసుకొచ్చారు. ఇప్పటికే ప్రియాంక గాంధీతో షర్మిల భేటీ అయ్యారని సంచలన కథనం వెలువరించారు.
కర్ణాటకలో డీకే శివకుమార్ ను కలిసిన షర్మిల అంతకుముందే ప్రియాంక గాంధీతో మాట్లాడారని చెప్పుకొచ్చారు. శివకుమార్ ను షర్మిల కలిసిన తరువాత వైఎస్సార్ టీపీని కాంగ్రెస్ లో విలీనం చేస్తారని వార్తలు వచ్చాయి. వీటిని షర్మిల ఖండించినా భవిష్యత్ లో అలాంటి అవకాశం ఉండొచ్చునని అభిప్రాయం ఎక్కువగా వినిపిస్తోంది.
ఏపీలో పార్టీ బలపడేందుకు కాంగ్రెస్ ప్రయత్నం చేస్తోంది. పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత ఎపీకి ప్రత్యేక హోదా ఇస్తామని రాహుల్ గాంధీ చేసిన ప్రామిస్ ఏపీ వాసులను కాంగ్రెస్ వైపు చూసేలా చేస్తోంది. కానీ ఎపీ కాంగ్రెస్ కు ప్రజాదరణ కల్గిన నేత కావాలి. అది వైఎస్ షర్మిల అని కాంగ్రెస్ భావిస్తోందని…షర్మిలను కాంగ్రెస్ లోకి తీసుకొస్తే జగన్ కు బదిలీ అయిన ఓటు బ్యాంక్ తిరిగి కాంగ్రెస్ కు షర్మిల రూపంలో వస్తుందని అంటున్నారు.
తెలంగాణ ఎన్నికల తర్వాత ఏదైనా జరగడానికి అవకాశం ఉందని ఎక్కువ మంది నమ్ముతున్నారు. ఆర్కే ఈ విషయాలను జనంలోకి పంపడానికి ప్రయత్నించారు. తెలంగాణలో రాజకీయాలు చేస్తోన్నా ఆశించిన మేర ఫలితాలు రాబట్టలేకపోయింది షర్మిల. దీంతో తెలంగాణ ఎన్నికల తరువాత ఆమె ఏపీలో రాజకీయం చేస్తే ప్రయోజనం ఉంటుందని అంటున్నారు. ఇందులో భాగంగా ఆమెకు ఏపీ పీసీసీ చీఫ్ పదవి ఇస్తారని అంటున్నారు.