తెలంగాణ యువజన కాంగ్రెస్ సోషల్ మీడియా చైర్మన్ జయల ప్రశాంత్ నేతృత్వంలోని యూత్ కాంగ్రెస్ వార్ రూమ్ పై సైబరాబాద్ పోలీసులు సోమవారం సాయంత్రం దాడులు చేశారు. పేపర్ లీక్ ,యూత్ డిక్లరేషన్ అంశాలను ప్రజల్లోకి ఎలా తీసుకెళ్ళాలి..?అనే వ్యూహాలతో స్టోర్ చేసి పెట్టుకున్న హార్డ్ డిస్క్ ,కంప్యూటర్ ,ల్యాప్ టాప్ లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎలాంటి నోటిసులు ఇవ్వకుండానే వార్ రూమ్ లోకి చొరబడిన పోలీసులు సోషల్ మీడియా టీం నుంచి సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకొని వారిని బయటకు వెళ్ళకుండా బందించారు. అనంతరం కంప్యూటర్లు,హార్డ్ డిస్క్ ల సేకరణ తరువాత ఉద్యోగులను బయటకు పంపించారు. ఈ ఘటనను టీపీసీసీ అద్యక్షులు రేవంత్ రెడ్డి,యూత్ కాంగ్రెస్ అద్యక్షుడు శివసేనా రెడ్డి ఖండించారు.
కర్ణాటక ఎన్నికల్లో యువజన కాంగ్రెస్ వ్యూహాలతో పార్టీ గెలుపు సులభమైందని కేపీసీసీ అద్యక్షుడు డీకే శివకుమార్ వ్యాఖ్యానించిన మరుసటి రోజు తెలంగాణలో యూత్ కాంగ్రెస్ వార్ రూమ్ పై పోలీసులు దాడి చేయడం చర్చనీయాంశం అవుతోంది. తెలంగాణలో యూత్ కాంగ్రెస్ వ్యూహాలకు బ్రేకులు వేయకపోతే కర్ణాటక ఫలితం ఇక్కడ పునరావృత్తం అవుతుందన్న ఆందోళనతోనే ప్రభుత్వ పెద్దలు వార్ రూమ్ పై దాడికి ఆదేశాలు ఇచ్చారా అనే అనుమానం తలెత్తుతోంది.అయితే, ప్రగతి భవన్ లో కేసీఆర్ అత్యవసర సమావేశం ప్రారంభమైన కాసేపటికే సైబరాబాద్ పోలీసులు యువజన కాంగ్రెస్ వార్ రూమ్ పై దాడులు చేయడం గమనార్హం. అంటే యూత్ కాంగ్రెస్ సోషల్ మీడియాను నియంత్రించాలని ప్రగతి భవన్ నుంచే పోలిసులకు ఆదేశాలు వెళ్ళాయని స్పష్టం అవుతోంది.
పేపర్ లీక్ జరిగిన నాటి నుంచి పోస్టింగ్ లతో ప్రభుత్వాన్ని యువజన కాంగ్రెస్ ఇరకాటంలో పడేస్తోంది.ఇది చాలదన్నట్లు ఇటీవలి యూత్ డిక్లరేషన్ నిరుద్యోగులను కాంగ్రెస్ వైపు ఆకర్షితుల్ని చేసేలా ఉన్నదని నిఘా వర్గాలు ప్రగతి భవన్ పెద్దలకు నివేదించాయి. ఈ అంశాలను కాంగ్రెస్ పార్టీ ప్రజల్లోకి తీసుకెళ్తే నిరుద్యోగులు గంపగుత్తగా కాంగ్రెస్ వైపు మళ్లే అవకాశం ఉందని కేసీఆర్ దృష్టికి తీసుకెళ్ళాయి. రాబోయే ప్రమాదాన్ని ముందే అంచనా వేసే కేసీఆర్…యువజన కాంగ్రెస్ వార్ రూమ్ పై దాడికి పోలీసులను ఆదేశించారని ఆరోపిస్తున్నారు. వరుసగా కాంగ్రెస్ వార్ రూమ్ లపై కేసీఆర్ సర్కార్ పోలీసులతో దాడులకు ఆదేశించడం చూస్తుంటే..ఆయనకు ఓటమి భయం పట్టుకుందని అంటున్నారు.