కేసీఆర్ ఏం చేసినా రాజకీయ ప్రయోజనం లేకుండా ఏపని చేయరనేది చెప్పాల్సిన పనిలేదు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు మునుపు కానీ రాష్ట్ర ఏర్పాటు తరువాత కానీ ఆయన అదే ధోరణి అవలంభిస్తున్నారు. ప్రతిపక్షాలు నిరసన కార్యక్రమాలు చేపట్టినా… భారీ బహిరంగ సభలు నిర్వహించినా కౌంటర్ గా ఏదో కార్యక్రమంతో మీడియాలో స్పెస్ దక్కించుకుంటారు. ఇప్పుడు కూడా అదే చేశారు.
కర్ణాటక ఎన్నికల ఫలితంతో తెలంగాణ కాంగ్రెస్ ఫుల్ స్వింగ్ లోకి వచ్చేసింది. నేడు కర్నాటకలో బీజేపీని కొట్టాం.. రేపు తెలంగాణలో బీఆర్ఎస్ ను దెబ్బతీస్తామని చెబుతున్నారు. కర్ణాటక ఎన్నికల ఫలితంతో మార్పు మొదలైందని ప్రచారం చేసుకుంటూ కాంగ్రెస్ మైలేజ్ పొందే ప్రయత్నం చేస్తోంది. జనాలు కూడా కాంగ్రెస్ గెలుపు గురించి చర్చిస్తున్నారు.
ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ కు బలం చేకూరుతుందని అంచనా వేసిన కేసీఆర్, ప్రజల అటెన్షన్ తనవైపు తిప్పుకునేందుకు ప్రెస్ నోట్ విడుదల చేశారు. కర్నాటక ఎన్నికల ఫలితాలు వెలువడిన కొద్ది గంటలకు తెలంగాణ సీఎంవో నుంచి విడుదలైన ఒక ప్రెస్ నోట్ ఆసక్తికరంగా మారింది.
తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్ని ఘనంగా జరపాలని, అందుకు సంబంధించిన ఏర్పాట్లు ఎలా ఉంటాయన్న విషయాన్ని తెలియజేసేలా ఓ ప్రకటన విడుదల చేశారు. జూన్ రెండు నుంచి 21 రోజుల పాటు ఈ సంబురాలు జరగాలని ఆదేశించారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లు చేసుకోవాల్సిందిగా చెప్పారు.
21రోజులపాటు రోజుకో కార్యక్రమం చేపట్టాలని కేసీఆర్ ఆదేశించారు. రాష్ట్రాభివృద్ధి గురించి విశ్లేషిస్తూ డాక్యుమెంటును రూపొందించి సినిమాహాళ్లు, టీవీలు తదితర మాధ్యమాల ద్వారా ప్రదర్శించాలన్న కేసీఆర్… తెలంగాణ ఉద్యమ చరిత్ర తెలియజేసేలా డాక్యుమెంటరీ రూపొందించాలని కోరారు.
కేసీఆర్ ఏకంగా 21రోజులపాటు ఉత్సవాలు నిర్వహించాలని ఆదేశించడం వెనక వ్యూహం దాగి ఉంది. మరో ఆరు నెలలో ఎన్నికలు జరగనున్నాయి. ఈ సమయంలో మరోసారి సెంటిమెంట్ ను రగిల్చి లబ్దిపొందాలన్న కేసీఆర్ లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోంది.
తెలంగాణ అభివృద్ధి గురించి ప్రచారం చేయాలనీ ఆదేశిస్తోన్న కేసీఆర్..ఏ కోశాన రాష్ట్రం అభివృద్ధి చెందిందో, ఉద్యమ ఆకాంక్షలు నెరవేరాయో చెప్పాలంటున్నారు. పదేళ్లు గడిచినా.. ఇప్పటికి ఇంటికో ఉద్యోగం రాలేదు. రైతుల ఆత్మహత్యలు ఆగనేలేదు. ఇలా చెప్పుకుంటూ పోతే సమస్యలెన్నో.
ఇన్ని ఉన్నప్పటికీ 21 రోజుల పండుగను నిర్వహించుకోవాలా? అందుకోసం భారీగా నిధులు ఖర్చు పెట్టాలా? అన్నది అందరి మదిలో లేవనెత్తుతోన్న ప్రశ్న.