కర్ణాటక ఎన్నికల పోలింగ్ కు మరికొన్ని గంటల సమయం ఉందనగా కీలక పరిణామం చోటుచేసుకుంది. బుధవారం అసెంబ్లీ ఎన్నికల ఎన్నికల పోలింగ్ జరగనున్న నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా హనుమాన్ చాలీసా పఠనంపై కేంద్ర ఎన్నికల కమిషన్ నిషేధం విధిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది.
భజరంగ్ దళ్ ను నిషేధిస్తామని కాంగ్రెస్ నేతల ప్రకటనలకు నిరసనంగా మంగళవారం బెంగళూర్ లో హనుమాన్ చాలీసాను పఠించాలంటూ బీజేపీ పిలుపునిచ్చింది. భజరంగ్ దళ్ బ్యాన్ అంశాన్ని బేస్ చేసుకొని ఎన్నికల్లో సానుకూల ఫలితాలను పొందాలని బీజేపీ ఆలోచించి ఈ పిలుపు ఇచ్చినట్లు కనబడుతోంది. ఈ క్రమంలోనే కేంద్ర ఎన్నికల కమిషన్ కలగజేసుకుంది.
హనుమాన్ చాలీసాను పఠించకుండా ఉండేందుకు వీలుగా నిషేధం విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. బెంగళూర్ లోని విజయనగర్ లోని ఓ గుడి బయట ఐదుగురు కంటే ఎక్కువమంది గూమిగూడవద్దని బీజేపీ నేతలను, వీహెచ్ పీ నేతలను ఆదేశించింది. తమ ఆదేశాలను బేఖాతరు చేస్తూ ఎవరైనా కార్యక్రమాన్ని కొనసాగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎన్నికల సంఘం హెచ్చరించింది.
ఈసీ తీసుకున్న ఈ నిర్ణయం కర్ణాటక రాజకీయాల్లో సంచలనంగా మారింది. ఎన్నికలపై బజరంగ్ దళ్ పై నిషేధం ప్రకటన కాంగ్రెస్ ను చిక్కులలో పడేస్తుందన్న విశ్లేషణలు వ్యక్తం అవుతున్నాయి. చూడాలి మరి ఏం జరుగుతుందో..!!