పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణారావులను బీజేపీలో చేర్చుకొని పార్టీలో కొత్త ఊపు తీసుకురావాలని కమలదళం భావిస్తోంది. ఇందుకోసం వారిద్దరితో బీజేపీ చేరికల కమిటీ చర్చలు జరిపింది. బీజేపీలో చేరాలని పొంగులేటి, జూపల్లిలను ఆహ్వానించింది. గురువారం మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు దాదాపు ఐదు గంటలపాటు సుదీర్ఘంగా చర్చలు జరిపింది.
ఈ చర్చలు జరుగుతోన్న సమయంలో బీజేపీ అనుకూల మీడియా అత్యుత్సాహం ప్రదర్శించింది. జూపల్లి, పొంగులేటిలు బీజేపీలో చేరడం ఖాయమైందని కథనాలు ప్రసారం చేసింది. చర్చలు పూర్తికాకుండానే బ్రేకింగ్ లు వేసి బీజేపీకి మైలేజ్ పెంచే ప్రయత్నం చేసింది కానీ చివర్లో ఆ ఇద్దరి నేతల నుంచి సానుకూల ప్రకటన రాకపోవడంత ఆ పార్టీ అనుకూల మీడియాతోపాటు బీజేపీ నేతల నోట్లో పచ్చి వెలక్కాయ పడినట్లు అయింది. ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస రెడ్డి ఇంటిని వేదికగా చేసుకొని మాజీ మంత్రి జూపల్లి క్రిష్ణా రావుతో నిర్వహించిన ఐదు గంటల సమావేశం ఏమీ తేల్చకుండానే ముగిసింది.
పొంగులేటి తన అనుచరులకు ఖమ్మం జిల్లాలో సీట్లు ఇవ్వాలని పట్టుబడుతున్నారని…ఈ విషయంపై ఏ పార్టీ స్పష్టత ఇస్తే ఆ పార్టీలో చేరుతాననే షరతు పెట్టినట్లు మొదటి నుంచి ప్రచారం జరుగుతోంది. కానీ అటు బీజేపీ , ఇటు కాంగ్రెస్ నుంచి కాని స్పష్టమైన హామీ లభించకపోవడంతోనే ఆయన ఏ పార్టీలో చేరాలో తేల్చుకోలేకపోతున్నారనే టాక్ వినిపిస్తోంది. ఏసారి కూడా ఇదే కండిషన్ పెట్టారా..? లేదా అన్నది స్పష్టత లేదు. ఇక, జూపల్లి కూడా తనకు పార్టీలో సరైన ప్రాధాన్యత ఉంటేనే పార్టీలో చేరుతాననే కండిషన్స్ పెట్టినట్లు తెలుస్తోంది.
కేసీఆర్ ను గద్దె దించాలంటే బీజేపీతోనే సాధ్యమని ఆ ఇద్దరు నేతలకు సూచించారు. కేసీఆర్ వ్యతిరేక శక్తులు ఒకే గూటికి చేరి పోరాడాలని అభిప్రాయపడ్డారు. కానీ జూపల్లి, పొంగులేటిలతో భేటీ అయిన నేతలంతా రాష్ట్ర అద్యక్షుడు బండి సంజయ్ వ్యతిరేక వర్గమే. బండి సంజయ్ వర్గం పార్టీలో పట్టుకోసం ప్రయత్నిస్తుంటే ఈటల, రఘునందన్ , ఎన్నం శ్రీనివాస్ రెడ్డి వంటి నేతలు బండి సంజయ్ పై అసంతృప్తిగా ఉన్నారు. అక్కడ గ్రూప్ తగాదాలు కూడా ఉన్నాయి.
కొత్తగా పార్టీలో చేరే నేతలు పార్టీలో ఏ వర్గంలో చేరితే ఎలాంటి తలనొప్పి తడుతుందోనని ఆందోళన చెందుతున్నారు. ఇప్పుడు పొంగులేటిని కూడా ఫియర్ వెంటాడుతోంది. టికెట్ల అంశం రాష్ట్ర అద్యక్షుడి పరిధిలోని అంశం. కాబట్టి చేరికల కమిటీ నేతలు ఖమ్మం సీట్లపై హామీ ఇచ్చి పార్టీలో చేర్చుకొని చివరికి టికెట్ల విషయంలో మొండిచేయి చూపితే పరిస్థితి ఏంటని పొంగులేటి ప్రశ్నించారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి.
కేసీఆర్ అవినీతిపై పోరాడుదామని చేరికల కమిటీ నేతలు ప్రతిపాదించినా పొంగులేటికి ఇంకా నమ్మకం ఏర్పడలేదని అందుకే ఆయన ఇంకాస్త వేచిచూసే ధోరణిలో ఉన్నారన్న వాదనలు వినిపిస్తున్నాయి. కేసీఆర్ కుటుంబ అవినీతిపై కేంద్ర పెద్దలు సైతం ఆరోపణలు చేస్తోన్నా ఎందుకింకా విచారణ జరిపించడం లేదని.. భవిష్యత్ లో రెండు పార్టీలు కలిసిపోతే పరిస్థితి ఏంటని… అందుకే తన అనుచరులతో కలిసి చర్చించి నిర్ణయం చెబుతామని చేరికల కమిటీకి పొంగులేటి చెప్పినట్లు సమాచారం.