షుగర్ ఉన్నవాళ్ళు ‘మందు’లు వాడుతుంటారు. ఈ ‘మందు’లతో పాటు ‘మందు’ కొడితే ఏమౌతుంది? అనే గొప్ప సందేహం మన మందుప్రేమికులకు కలుగుతుంది. దానిని జవాబు ఒక్కటే. మద్యం తాగకూడదు. ఇందులో ఎటువంటి మినహాయింపులు లేవు. మద్యం తాగాక మందులు వేసుకోవచ్చా? అన్న ప్రశ్న చాలా మందికి కలుగుతుంది. అది కూడా మంచిది కాదు. ఒక్కసారి షుగర్ బయటపడిన వాళ్ళు జీవితాంతం మందులు వాడాలి, జీవితాంతం మందుకు దూరంగా ఉండడం మేలు. షుగరుకు మద్యం తోడైతే అగ్నికి ఆజ్యం పోసినట్లవుతుందని గుర్తు పెట్టుకోవాలి. మద్యంతో నాడులు దెబ్బతింటాయని అని గుర్తు పెట్టుకోవాలి.
మామూలుగానే మధుమేహులకు సున్నితమైన నాడులు దెబ్బతినే ముప్పు ఎక్కువగా ఉంటుంది. ఎంత ఎక్కువకాలం నుంచి షుగరుతో బాధపడుతుంటే అంత ఎక్కువగా నాడులు దెబ్బతినే ప్రమాదముందని హెచ్చరిస్తున్నారు డాక్టర్లు. దీనివల్ల చాలామంది కాళ్లు, చేతుల తిమ్మిర్లెక్కడం, మంట పెట్టటం, సూదులతో పొడిచినట్టు అనిపించటం వంటి వాటితో బాధపడుతుంటారు. ఈ సమస్యలకు షుగరు తోడైతే వ్యాధులన్నీ తీవ్రతరమవుతాయి. కాళ్లు మొద్దుబారడం, పుండ్లు పడటం, పుండ్లు మానకపోతే వేళ్లు, పాదాలు, కాళ్లు తొలగించాల్సి రావడం జరుగుతుంటుంది. ఒక గాయం అయితే అంత తొందరగా మానదు.
ఎప్పుడైనా మద్యం తాగాల్సి వస్తే ముందు భోజనం చేసి మాత్రలు వేసుకోవాలి. మద్యం ఒకటి, రెండు పెగ్గులు పరవాలేదు. కానీ తూలిపడెంత తాగితేనే ప్రమాదం. తర్వాత భోజనం చేయకపోతే మందులు వేసుకోకూడదు. అది మరీ ప్రమాదం. కాలేయం నిరంతరం గ్లూకోజ్ ను ఉత్పత్తి చేస్తూ రక్తంలో గ్లూకోజు మొతాదులు స్థిరంగా ఉండేలా చూస్తుంది. ఈ ప్రక్రియను మద్యంలోని ఆల్కహాల్ దెబ్బతీస్తుంది. దీనివల్ల శరీరానికి తగినంత గ్లూకోజు ఉత్పట్టి కాదు. ఫలితంగా గ్లూకోజు మోతాదులు పడిపోతాయి.
యాంటీ బయోటిక్స్, నొప్పిని తగ్గించే మందులవంటివి జీర్ణాశయ పూత సమస్యకు దారితీస్తాయి. మద్యం కూడా ఈ సమస్యను తెచ్చిపెడుతుంది. మందులు, మద్యం రెండూ కలిస్తే సమస్య ఇంకా ఎక్కువవుతుందేకానీ తగ్గదు. కొందరికి వాంతులు, ఛాతీలో మంట వస్తాయి. మరికొందరికి రక్తపు వాంతులు వస్తాయి. మందులు వేసుకునేటప్పుడు మద్యం జోలికి వెళ్లకపోవడం చాలా మంచిది.