హైదరాబాద్ ను విశ్వనగరంగా తీర్చిదిద్దామని…కొత్త సెక్రటేరియట్ నిర్మాణంతో హైదరాబాద్ కీర్తి ప్రతిష్టలు మరింత పెంచామని సర్కార్ చెప్పుకుంటున్న వేళ… బీఆర్ఎస్ చెప్తున్న దానికి వాస్తవ పరిస్థితులు పూర్తి భిన్నంగా ఉన్నాయి.ఓపెన్ నాలా కారణంగా సికింద్రాబాద్ కళాసిగూడలో ఓ చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. ప్రమాదం ఉన్న ప్రాంతాల్లో కనీసం కాషన్ బోర్డులు కూడా ఏర్పాటు చేయలేదు. దీంతో అసలు హైదరాబాద్ లో మౌలిక వసతుల కల్పనపై చర్చలు ప్రారంభమయ్యాయి. సెక్రటేరియట్ నిర్మాణంతో అద్భుతం సృష్టించి హైదరాబాద్ ఇమేజ్ ను మరింత పెంచామని చెప్పుకుంటున్న వేళ ఈ విషాద సంఘటన చోటుచేసుకోవడం బీఆర్ఎస్ సర్కార్ కు చేటు తెచ్చేదే.
ఇది ఎండాకాలం. ఈ ఎండాకాలంలో వర్షాలు ఏకధాటిగా కురవవు. గంట లేదా అరగంటపాటు దంచికొడుతాయి. అంత దానికే కాలనీలు జలమయం అవుతున్నాయి. డ్రైనేజ్ లు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. కార్లు కొట్టుకుపోతున్నాయి. ఇంట్లో నుంచి బయటకు రావాలంటే భయపడిపోతున్న పరిస్థితి. ఇలాంటి పరిస్థితి ఎప్పుడు ఉండేదే. కాని హైదరాబాద్ ను లండన్ చేశాం.. డల్లాస్ చేశామని గొప్పలు చెప్పుకుంటున్న పాలకులు.. కనీసం ఓ గంటపాటు వర్షం కురిస్తే పోటెత్తుతున్న వరదల నుంచి హైదరాబాద్ కు విముక్తి కల్పించలేకపొతున్నారు. ఇది ఖచ్చితంగా బీఆర్ఎస్ సర్కార్ ఫెయిల్యూరే.
తెలంగాణ వచ్చాక కూడా ఈ పరిస్థితి కొనసాగుతుండటం బీఆర్ఎస్ సర్కార్ కు శోభనిస్తుందా.? ఆలోచించాలి. ఇలాంటి దుస్థితి ఉన్నా ఎందుకు బాగు చేయడం లేదన్నది అందరి ప్రశ్న. ప్రగతి భవన్ లు, సచివాలయాలు, ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయాలు, ఎత్తైన విగ్రహాల నిర్మాణం, ఆకాశ హర్మ్యాలతో హైదరాబాద్ నగర ఇమేజ్ పెరుగదు. ప్రజల మౌలిక వసతుల కల్పనపై నగర ప్రతిష్ట ఆధారపడి ఉంటుందనే వాస్తవాన్ని పాలకులు ఎప్పుడు అర్థం చేసుకుంటారో. తెలంగాణ కొత్త సచివాలయం పబ్లిసిటీ పతాక స్థాయికి చేరిన వేళ ఓ గంట పాటు కురిసిన వర్షానికి హైదరాబాద్‌లో బీభత్సం సృష్టించడం వలన ఓ చిన్నారి మృతి చెందటంతో నగర అభివృద్ధికి కేసీఆర్ చేసినదేమి అనే చర్చలు ప్రారంభమయ్యాయి.
ఓపెన్ నాలా కారణంగా ఇప్పుడు ఓ చిన్నారి చనిపోయింది. ఇది మొదటి కాదు.. అలాగని చివరదని కూడా చెప్పలేం. ఎందుకంటే… నగరంలో వర్షాలు దంచికొట్టిన ప్రతిసారి ఎవరో ఒకరు ప్రాణాలు కోల్పోతున్న సంఘటనలు ప్రతి ఏడాది వెలుగుచూస్తూనే ఉన్నాయి. సర్కార్ సానుభూతి తెలపడం.. ఆర్ధిక సాయం చేసి చేతులు దులుపుకోవడం వంటివి చేస్తోంది తప్పితే శాశ్వత పరిష్కారానికి మాత్రం చర్యలు తీసుకోవడం లేదు. సర్కార్ ఎప్పుడు కళ్ళు తెరుస్తుందో లేదో చూడాలి.