తెలంగాణ రాజకీయాలు శరవేగంగా మారిపోతున్నాయి. బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అసలు సందర్భానుసారం వ్యాఖ్యలు చేసి పెద్ద చర్చకు తెరలేపారు. మునుగోడు బైపోల్ లో కేసీఆర్ నుంచి కాంగ్రెస్ పార్టీ 25కోట్లు తీసుకుందని ఆరోపించారు. దీంతో వెంటనే ఈటలకు రేవంత్ రెడ్డి సవాల్ చేశారు. బీజేపీ సవాల్ కు ఎప్పుడు వేదికగా మార్చుకునే భాగ్యలక్ష్మి టెంపుల్ వద్దకు ఆధారాలతో ఈటల రావాలని, ప్రూఫ్స్ లేకపోతే తడిబట్టలతో ప్రమాణం చేయాలని రేవంత్ సవాల్ విసిరారు. శనివారం సాయంత్రం ఐదు గంటలకు ఇందుకు ముహూర్తం ఫిక్స్ చేశారు. రేవంత్ సవాల్ ను స్వీకరించేందుకు ఈటల వస్తారా.? లేదా అన్నది పక్కనపెడితే ఇదంతా వ్యూహత్మకమేనని విశ్లేషణలు వినిపిస్తున్నాయి.
ఈటలకు బీజేపీలో సరైన ప్రాధాన్యత లేదు. రాష్ట్ర అద్యక్షుడు బండి సంజయ్ నుంచి సహకారం అసలే అందటం లేదు. దీంతో పార్టీలో తన పరపతి పెంచుకోవాలనే ఇలా అసందర్బనుసారం కాంగ్రెస్ పై ఈటల ఆరోపణలు చేసి ఉంటారన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. పార్టీ అద్యక్షుడి మార్పు, సీఎం క్యాండిడేట్ పై బీజేపీలో జోరుగా చర్చ జరుగుతోన్న వేళ ఈటల అత్యుత్సాహంతో తన సహజశైలికి భిన్నమైన ఆరోపణలు చేశారని రాజకీయ వర్గాలు చెప్పుకోస్తున్నాయి. మరోవైపు…రాజకీయాల్లో కొంత క్వాలిటీ పాలిటిక్స్ చేసే ఈటల ఇలా దిగజారుడు రాజకీయాల వెనక ఎవరూ ఊహించని వ్యూహం ఉండొచ్చుననే వాదనలు కూడా ఉన్నాయి.
ఇప్పటి వరకూ బీఆర్ఎస్ తన ప్రత్యర్థి ఎవరో ఎంపిక చేసుకుంటూ వారిపైనే ఎక్కువగా టార్గెట్ చేస్తోంది. అత్యధిక సార్లు ఆ ప్రత్యర్థి బీజేపీనే అవుతోంది. దీంతో కాంగ్రెస్ పార్టీ వెనుకబడిపోతోంది. ఇదే ఫార్ములాతో అసలు బీఆర్ఎస్ ను రేసులో లేకుండా చేయడానికి బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ అన్నట్లుగా రాజకీయం మారడానికి రేవంత్, ఈటల ప్లాన్ చేసుకున్నారని అంటున్నారు. అందుకే సందర్భం లేకుండా ఆరోపణలు చేసుకుని చాలెంజ్ లు చేసుకున్నారని విమర్శిస్తున్నారు.
పైగా.. ఈటల బీజేపీలో ఇమడలేకపోతున్నారు. పార్టీలో ఉక్కపోత పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. ఇదే పరిస్థితి కంటిన్యూ అవుతే పార్టీ మారాలని ఈటల భావిస్తున్నారన్న వాదనలు ఉన్నాయి. దీంతో కాంగ్రెస్ కు కాస్త అడ్వాంటేజ్ ఇవ్వాలనే ఈటల ఈ సంచలన ఆరోపణలు చేసి ఉంటారన్న విశ్లేషణలు వ్యక్తం అవుతున్నాయి.