వైజాగ్ స్టీల్ ప్లాంట్ విషయంలో తెగ హడావిడి చేసిన తెలంగాణ సర్కార్ చివరికి చల్లబడింది. స్టీల్ ప్లాంట్ ను మేమే కొంటామంటూ బిడ్ దాఖలు చేస్తామని ఊరించి, ఊరించి ఉసురుమనిపించింది. సింగరేణి అధికారులు కోరారని బిడ్ దాఖలు చేసేందుకు ఐదు రోజుల సమయం కూడా ఇచ్చింది స్టీల్ ప్లాంట్ యాజమాన్యం. కానీ తెలంగాణ సర్కార్ సింగరేణితో కలిసి ఈవోఐ బిడ్లను దాఖలు చేయలేదు. ఇప్పుడు ఆ ఐదు రోజుల గడువు కూడా ముగిసింది.
విశాఖ స్టీల్ ప్లాంట్ ను కొనుగోలు చేస్తామని తెలంగాణ ప్రభుత్వం, సింగరేణి యాజమాన్యం విశాఖ స్టీల్ ప్లాంట్ ను పరిశీలించింది. బిడ్ దాఖలు చేసే విషయమై ఉన్నాతాదికారులతో చర్చలు కూడా జరిపింది. వివరాలు సేకరించి తెలంగాణ ప్రభుత్వానికి సింగరేణి అధికారులు నివేదిక సమర్పించారు. ప్రభుత్వం అనుమతి ఇస్తే బిడ్ దాఖలు చేసేందుకు సింగరేణి అధికారులు రెడీ అయ్యారు. కానీ ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాలేదు. దాంతో సింగరేణి అధికారులు కూడా సైలెంట్ అయ్యారు. ఇప్పుడు బిడ్ దాఖలు చేసేందుకు సమయం కూడా ముగిసింది.
ఒకవేళ సింగరేణికి బిడ్ లభిస్తే అందుకోసం రూ. 5వేల కోట్లు కేటాయించాల్సి ఉంటుంది. అసలే ఆర్ధిక భారంతో సతమతం అవుతోన్న సింగరేణికి ఇది మరింత గుదిబండంగా మారనుంది. అదే సమయంలో తెలంగాణ సర్కార్ పై తీవ్ర విమర్శలు వస్తాయి. తెలంగాణలో మూతబడిన పరిశ్రమలను తెరిపించలేదు కానీ పొరుగు రాష్ట్రంలోని పరిశ్రమ కోసం వేల కోట్లు ఖర్చు చేస్తున్నారని ప్రభుత్వం విమర్శల పాలయ్యే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి. సింగరేణికి మూలధనం ఇచ్చేంత ఉంటే మొదటగా నిజాం షుగర్ ఫ్యాక్టరీని రీఓపెన్ చేయించాలనే డిమాండ్ లు వస్తాయి.
పొరుగు రాష్ట్రంలో పార్టీ విస్తరణ కోసం పాకులాడుతే పార్టీ బలంగా ఉన్న తెలంగాణలో బలహీనపడే అవకాశం ఉందని బీఆర్ఎస్ అంచనా వేసినట్లు ఉంది. అందుకే స్టీల్ ప్లాంట్ లో బిడ్ దాఖలు చేసే విషయంలో సైలెంట్ అవ్వడమే సరైనదని సర్కార్ భావించినట్లు తెలుస్తోంది.
Also Read : ఏపీ ప్రజలను ఫూల్స్ చేసిన కేసీఆర్..!?