తెలంగాణలో ఎన్నికలకు సమయం దగ్గర పడుతోన్న కొద్దీ టికెట్ ఆశావహులు పెరిగిపోతున్నారు. దాదాపు ఐదారు నియోజకవర్గాలు మినహా అన్ని నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ టికెట్ కోసం తీవ్ర పోటీ నెలకొంది. అయితే.. కంటోన్మెంట్ టికెట్ కోసం దివంగత ఎమ్మెల్యే సాయన్న కుటుంబ సభ్యుల మధ్య పోటీ కనిపిస్తోంది. ఆయన ముగ్గురు కుమార్తెలు కంటోన్మెంట్ బీఆర్ఎస్ టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. నమ్రత, లాస్య నందిత, నివేదిత ఈ ముగ్గురు ఎవరికీ వారు ప్రయత్నాలు చేస్తున్నారు.
సాయన్న కుమార్తెలకు టికెట్ ఇస్తే ఆయన చరిష్మాతో బీఆర్ఎస్ గెలవడం ఖాయమని సాయన్న సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. అయితే.. ముఖ్యంగా లాస్యనందిత టికెట్ ప్రయత్నాలో ముందంజలో ఉన్నట్లు తెలుస్తోంది. గతంలో కవాడిగూడ డివిజన్ నుంచి బీఆర్ఎస్ తరుఫున పోటీచేసి గెలుపొందిన ఆమె తరువాత ఎన్నికల్లో ఓటమి పాలైంది. సాయన్న వారసురాలిగా లాస్యనందితను ప్రకటిస్తే ప్రజల నుంచి మద్దతు లభిస్తుందని వచ్చే ఎన్నికల్లో గెలుపు ఈజీ అవుతుందని ఆమె అనుకూల వర్గం ప్రచారం చేస్తోంది.
మరోవైపు నమ్రత కూడా నియోజకవర్గంలోనే ఉంటున్నారు. ప్రజలకు ఏ సమస్యలు వచ్చినా పరామర్శిస్తు టికెట్ రేసులో ఉండేలా వ్యవహరిస్తున్నారు. నివేదిత కూడా టికెట్ కోసం ప్రయత్నాల్లో ఉన్నారు. దీంతో సాయన్న కుటుంబంలో టికెట్ కోసం పోరు పీక్ స్టేజ్ కు చేరుకుందని పరిశీలకులు అంటున్నారు. అయితే.. ఇక్కడి నుంచే మంత్రి హరీష్ రావు అనుచరుడు ఏర్రోల్ల శ్రీనివాస్ పోటీకి ఆసక్తి చూపిస్తుండగా… కేటీఆర్ కోటరీ నేతగా పేరొందిన మన్నే క్రిశాంక్ కూడా కంటోన్మెంట్ టికెట్ ఆశిస్తున్నారు. దీంతో కంటోన్మెంట్ టికెట్ విషయంలో రసవత్తర పోరు నడుస్తున్నట్లు కనిపిస్తోంది.
72 ఏళ్ల సాయన్న ఈ ఏడాది ఫిబ్రవరిలో అనారోగ్యం కారణంగా మరణించారు. దీంతో వాస్తవానికి ఇక్కడ ఉప ఎన్నిక రావాల్సి ఉంది. కానీ సాధారణ ఎన్నికలకు సమయం దగ్గర పడడంతో ఇక్కడ ఒకే సారి నవంబరులో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాలని ఎన్నికల సంఘం డిసైడ్ అయింది. అయితే.. సాయన్న మరణంతో ఈ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ పెద్ద దిక్కును కోల్పోయింది.