వివేకా హత్య కేసులో ఈ నెల 25వ తేదీ వరకు అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయవద్దనే తెలంగాణ హైకోర్టు ఆదేశాలను సవాల్ చేస్తూ వివేకా కూతురు సునీతా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అవినాష్ రెడ్డి అరెస్ట్ విషయంలో సీబీఐకి స్వేఛ్చను ఇవ్వాలని ఆమె సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కాగా సునీత పిటిషన్ ను విచారణకు స్వీకరిస్తున్నట్లు సుప్రీంకోర్టు సీజేఐ చంద్రచూడ్ తెలిపారు. శుక్రవారం సునీత దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ జరుపుతామని వెల్లడించారు.
వివేకా హత్య కేసులో తనను అరెస్ట్ చేయకుండా సీబీఐని ఆదేశించాలని కోరుతూ ఇటీవల ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు అవినాష్ రెడ్డి. ఈ పిటిషన్ పై విచారణ చేపట్టిన హైకోర్టు… పిటిషనర్ తరుఫు న్యాయవాది, సీబీఐ తరుఫు న్యాయవాది వాదనలు విన్న అనంతరం కీలక ఆదేశాలు ఇచ్చింది. ఈ నెల 25వ తేదీ వరకు అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి వీలు లేదంటూ సీబీఐకి స్పష్టం చేసింది.
అయితే ఈ నెల 25వ తేదీ వరకు సీబీఐ విచారణకు అవినాష్ రెడ్డి వెళ్లాలని…విచారణ సందర్భంగా అవినాష్ రెడ్డి చెప్పే సమాధానాలను ఆడియో, వీడియో రికార్డింగ్ చేయాలని సీబీఐని హైకోర్టు ఆదేశించింది. వీటిని తిరిగి హైకోర్టుకు సమర్పించాలని కూడా వెల్లడించింది.
అవినాష్ రెడ్డిని 25వ తేదీ వరకు అరెస్ట్ చేయకూడదని హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో తాజాగా సునీత పిటిషన్ దాఖలు చేశారు. ఈమె పిటిషన్ శుక్రవారం ( ఏప్రిల్ 21)న విచారణకు రానుంది. హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టు కొట్టివేస్తే ఏ క్షణమైనా అవినాష్ రెడ్డిని సీబీఐ అరెస్ట్ చేసే అవకాశం ఉంది.
Also Read : హైకోర్టులో అవినాష్ రెడ్డికి ఊరట