ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ మైత్రి మూవీస్ మేకర్స్ సంస్థపై ఐటీ దాడులు జరుగుతున్నట్లు తెలుస్తోంది. మైత్రి మూవీ మేకర్స్ సంస్థతోపాటు టాలీవుడ్ కు చెందిన ఓ ప్రముఖ దర్శకుడి నివాసంలోనూ సోదాలు జరుగుతున్నట్లు సమాచారం. నిర్మాణ సంస్థ డైరక్టర్లు అయిన రవిశంకర్ , నవీన్ లకు చెందిన నివాసాలలో, కార్యాలయాల్లో ఐటీ అధికారులు సోదాలు జరుపుతున్నట్లు తెలుస్తోంది.
ఐటీ అధికారులు సోదాల్లో పలు డాక్యుమెంట్స్ ను స్వాధీనం చేసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. మైత్రీ మూవీస్ సంస్థ ఇటీవల వరుసగా భారీ బడ్జెట్ చిత్రాలను నిర్మిస్తోంది. దీంతో ఈ సినిమా నిర్మాణాల కోసం అంత డబ్బు ఎక్కడి నుంచి వస్తోంది..?ఎలా పెట్టుబడులు పెడుతున్నారని రవిశంకర్ , నవీన్ లను ఐటీ అధికారులు ఆరా తీసినట్లు ప్రచారం జరుగుతోంది.
హీరో, హీరోయిన్లకు ఇచ్చే పారితోషకంతోపాటు లాభాల గురించి ఐటీ అధికారులు ప్రశ్నించినట్లు కనబడుతోంది. గత ఏడాది కూడా మైత్రి మూవీస్ మేకర్స్ సంస్థపై ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఆ తరువాత ఇదంతా రెగ్యులర్ చెకప్ లో భాగంగానే జరిగిందని చెప్పారు. ఈసారి కూడా రెగ్యులర్ చెకప్ లో భాగంగానే సోదాలు జరుగుతున్నాయా..? లేక పన్ను ఎగవేత కారణమా అనేది తెలియాల్సి ఉంది.