వివేకా హత్య కేసులో తనను అరెస్ట్ చేయకుండా సీబీఐని ఆదేశించాలని హైకోర్టును ఆశ్రయించిన అవినాష్ రెడ్డికి కోర్టులో తాత్కాలిక ఊరట లభించింది. ఏప్రిల్ 25వరకు అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి వీలు లేదంటూ స్పష్టం చేసింది. అయితే అప్పటివరకు కేసు విచారణలో సీబీఐ విచారణకు అవినాష్ రెడ్డి సహకరించాలని హైకోర్టు న్యాయమూర్తి సురేందర్ రెడ్డి ఆదేశించారు. అవినాష్ రెడ్డిని లిఖితపూర్వకంగా విచారించాలని సీబీఐని ఆదేశించిన న్యాయస్థానం… వీడియో రికార్డ్ చేయాలని సీబీఐ అధికారులను ఆదేశించింది. ఈ కేసులో 25న తుది తీర్పు ఇస్తామని వెల్లడించింది.
అవినాష్ రెడ్డికి ముందస్తు బెయిల్ ఇవ్వడానికి వీలు లేదంటూ హైకోర్టులో సీబీఐ తరుఫు న్యాయవాదులు గట్టిగానే వాదించారు. వివేకా హత్య కేసులో అవినాష్ రెడ్డి ప్రధాన సూత్రదారి అని స్పష్టం చేసింది. కడప ఎంపీ టికెట్ విషయంలో తలెత్తిన విబేధాలే హత్యకు దారి తీశాయని.. వివేకా చనిపోయిన మూడురోజులకే అవినాష్ రెడ్డికి కడప ఎంపీ టికెట్ ఖరారు అయిందని కోర్టు దృష్టికి తీసుకెళ్ళారు. అలాగే, అవినాష్ రెడ్డి చెబుతున్నట్లుగా లైంగిక వేధింపులు, ఆస్తి తగాదాలు అనే కోణంలో కూడా విచారణ చేపట్టామని అయితే వివేకా హత్యకు ఇవేవి కారణం కాదని తేలినట్లు కోర్టుకు నివేదించింది.
అనంతరం వివేకా హత్యకు అసలు కారణాలు ఏంటని అవినాష్ రెడ్డి తరుఫు న్యాయవాదిని హైకోర్టు న్యాయమూర్తి ప్రశ్నించారు. నాలుగు కారణాలతో వివేకా హత్య జరిగిందని తెలిపారు. వివేకా రెండో భార్యతో సునీతకు గొడవలు…బిజినెస్ లో గంగిరెడ్డితో తగాదాలు, రాజకీయ కారణాలు ఉన్నాయని వాదించారు. హత్యకు వాడిన ఆయుధం దొరికిందా..?వివేకాది గుండెపోటని ఎందుకు ప్రచారం చేయాల్సి వచ్చిందని అవినాష్ రెడ్డి తరుఫు న్యాయవాదిని న్యాయమూర్తి ప్రశ్నించారు. అనంతరం ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి ఈ నెల 25వ తేదీ వరకు అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయవద్దని ఆదేశించింది.
Also Read :వివేకా హత్యలో అసలు పాత్ర వాళ్ళదే- తేల్చిచెప్పిన సీబీఐ..!