కర్ణాటక ఎన్నికల్లో జేడీఎస్ తరుఫున ప్రచారం నిర్వహిస్తామని ఆ మధ్య ప్రకటించిన కేసీఆర్… ఎన్నికల షెడ్యూల్ రాగానే రంగంలోకి దిగుతున్నట్లు మాత్రం ఎక్కడ ప్రకటించలేదు. జేడీఎస్ – బీఆర్ఎస్ మధ్య సన్నిహిత సంబంధాలు దెబ్బతిన్నాయని ఖమ్మం సభ జరిగిన సమయంలో వార్తలొచ్చాయి. ఖమ్మం సభకు కుమారస్వామి హాజరుకాకపోవడం ఈ ప్రచారానికి మరింత బలాన్ని ఇచ్చింది.
కర్ణాటకలో జేడీఎస్ తో జట్టు కట్టి కొన్ని స్థానాల్లో బీఆర్ఎస్ పోటీ చేస్తుందని కూడా కేసీఆర్ ప్రకటించారు. అందుకు జేడీఎస్ అంగీకరించలేదన్న వాదనలు కూడా ఉన్నాయి. ఇదే రెండు పార్టీల మధ్య గ్యాప్ కు ప్రధాన కారణమనే విశ్లేషణలు వినిపించాయి. కర్ణాటక ఎన్నికల్లో జేడీఎస్ తరుఫున ప్రచారం చేసి కుమారస్వామిని సీఎం చేస్తామని ప్రకటించిన కేసీఆర్…ఎన్నికల ప్రచారం ప్రారంభమై రెండు వారాలు అవుతున్నా ప్రచారం ఊసే ఎత్తలేదు. కర్ణాటక ఎన్నికలను ఏమాత్రం పట్టించుకోడం లేదు కానీ మహారాష్ట్రలో సభ నిర్వహించేందుకు కేసీఆర్ రెడీ అయ్యారు. దీంతో కర్ణాటకలో ఎవరికీ మేలు చేసేందుకు కేసీఆర్ అక్కడ ప్రచారం చేయడం లేదు… మహారాష్ట్రపై ఎందుకంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నారన్న చర్చ విస్తృతంగా జరిగింది.
బీఆర్ఎస్ పై విమర్శలు చెలరేగుతున్నాయని వెనక్కి తెగ్గిందో ఏమో కానీ తాజాగా కర్ణాటకలో ప్రచారానికి వెళ్తున్నట్లు బీఆర్ఎస్ నేతలు ప్రకటించారు. జేడీఎస్ తరుఫున ప్రచారంలో పాల్గొంటామని స్పష్టం చేశారు. ఏప్రిల్ చివరి వారం లేదా మే మొదటి వారంలో ప్రచారానికి వెళ్లనున్నట్లు తెలిపారు. మంత్రి హరీష్ రావు ఆధ్వర్యంలో బీఆర్ఎస్ బృందం కర్ణాటక ఎన్నికల ప్రచారానికి వెళ్లనున్నట్లు వెల్లడించారు. తెలుగు రాష్ట్రాల ప్రజలు అత్యధికంగా ఉన్న నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ ప్రచారం చేయనుంది.
మొదట ప్రచారానికి దూరంగా ఉండాలనుకున్న బీఆర్ఎస్ సడెన్ గా తన నిర్ణయాన్ని మార్చుకోవడం వెనక ఏం జరిగి ఉంటుందన్న చర్చ రాజకీయ వర్గాల్లో ప్రారంభమైంది.