ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ టీమ్ భేటీ అయింది. సుమారు ఆరు గంటలపాటు ఈ సమావేశం కొనసాగింది. ఇటీవలే బీఆర్ఎస్ సస్పెన్షన్ కు గురైన పొంగులేటిని కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించింది రాహుల్ గాంధీ టీమ్. వీరి భేటీలో రాజకీయ అంశాలపై సుదీర్ఘంగా చర్చ జరిగింది. రాహుల్ గాంధీ టీమ్ స్పష్టమైన నివేదికను పొంగులేటి ముందు ఉంచడంతో ఆయన కాంగ్రెస్ లో చేరేందుకు సుముఖత వ్యక్తం చేశారు కానీ, సీట్ల కేటాయింపులో తనకు స్పష్టమైన హామీ కావాలంటూ పట్టుబడుతుండటంతో కాంగ్రెస్ లో చేరికపై పొంగులేటి అధికారిక ప్రకటన వెలువరించలేదు.
తన అనుచరులకు పది టికెట్లు ఇవ్వాలని రాహుల్ గాంధీ టీమ్ తో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నట్లు తెలుస్తోంది. మధిర, భద్రాచలం మినహా ఖమ్మం జిల్లాలోని మిగిలిన ఎనిమిది నియోజకవర్గాల్లో తన అనుచరులకు టికెట్ ఇవ్వడంతోపాటు కంటోన్మెంట్ లో కూడా తన అనుచరుడికి టికెట్ ఇవ్వాలని పొంగులేటి ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. టికెట్ల విషయంలో స్పష్టత ఇవ్వాలని పొంగులేటి కోరగా… ముందు పార్టీలోనైతే చేరండని రాహుల్ గాంధీ టీమ్ చెప్పినట్లు సమాచారం. టికెట్ల విషయం తరువాత మాట్లాడదామని రాహుల్ టీమ్ చెప్పడంతో కాంగ్రెస్ పార్టీలో చేరికపై పొంగులేటి ఎలాంటి హామీ ఇవ్వలేదు. దీంతో కాంగ్రెస్ పార్టీలో పొంగులేటి చేరికపై సస్పెన్స్ కంటిన్యూ అవుతోంది.
పొంగులేటి కోసం అటు బీజేపీ కూడా విశ్వప్రయత్నాలు చేస్తోంది. పొంగులేటి బీజేపీలో చేరితే ఏమాత్రం బలం లేని ఖమ్మం జిల్లాలో బలపడుతామని బీజేపీ రాష్ట్ర నాయకత్వం ఆయనను చేర్చుకునే దిశగా పావులు కదుపుతోంది. పొంగులేటితో సన్నిహితంగా మెదిలే నేతల ద్వారా గాలం వేస్తోంది. అయితే… బీజేపీలో చేరికపై కూడా ఆలోచన చేస్తోన్న పొంగులేటికి కమలం పార్టీ ఏమాత్రం సెట్ అవ్వదని రాహుల్ గాంధీ టీమ్ తెలిపింది. ఖమ్మం జిల్లాలో బీజేపీకి ఏమాత్రం బలం లేదని… అలాంటి పార్టీలో చేరి రాజకీయ భవిష్యత్ ను పాడుచేసుకోవద్దని.. తాము చెప్పిన విషయాలపై నమ్మకం కుదరకపోతే సొంతంగా సర్వే కూడా చేసుకోవచ్చునని చెప్పినట్లు తెలుస్తోంది.
రాహుల్ టీమ్ నివేదిక, సర్వే ఫలితాలను పొంగులేటికి వివరించగా ఆయన కొంత కన్విన్స్ అయినట్లు తెలుస్తోంది. కానీ సీట్ల విషయంలో ప్రామిస్ చేస్తే కాంగ్రెస్ లో చేరుతానని పొంగులేటి చెప్పడంతో ఈ విషయం తమ పరిదిలోనిది కాదని సునిల్ కనుగోలు టీమ్ అక్కడి నుంచి వెనుదిరిగినట్లు సమాచారం. అయితే.. పొంగులేటితోపాటు జూపల్లిని కూడా కాంగ్రెస్ లో చేర్చుకొని ఇతర పార్టీల నుంచి చేరికలను మరింత ప్రోత్సహించాలని రేవంత్ భావిస్తున్నారు. ఈమేరకు ఆయన రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ మాణిక్ రావు థాకరే తో గాంధీభవన్ లో భేటీ అయ్యారు. పొంగులేటి , జూపల్లిల విషయంలో ఎలా ముందుకు సాగాలనే అంశంపై ఇద్దరు నేతలు చర్చిస్తున్నారు.
Also Read : కాంగ్రెస్ లోకి మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు.. ?