తెలుగు రాష్ట్ర ప్రభుత్వాల మధ్య వైజాగ్ స్టీల్ ప్లాంట్ అంశం రచ్చ రాజేసింది. ఇదివరకు చాలా అంశాల్లో పూర్తి సహాయ సహకారాలు అందించుకున్న రెండు పార్టీల మధ్య వైరం తలెత్తడం అనుమానాలకు తావిస్తోంది. ఎన్నికలకు సమయం సమీపిస్తోన్న వేళ ఈ రాజకీయ వైరం కొత్త చర్చకు దారితీస్తోంది. ఎందుకంటే సెంటిమెంట్ రాజకీయాలు చేయడంలో కేసీఆర్ ను మించిన వారెవరు లేరు. చంద్రబాబును బూచిగా చూపి 2018ఎన్నికల్లో గట్టెక్కిన కేసీఆర్ ఇప్పుడు పార్టీ పేరు మార్చి ప్రాంతీయ వాదాన్ని పక్కనపడేశారు. ఈ నేపథ్యంలోనే తెలంగాణలో అధికారం చేజారిపోకుండా ఉండటంతోపాటు, జాతీయ స్థాయిలో పార్టీ బలోపేతం కొరకు బీఆర్ఎస్ బాస్ పెద్ద స్కెచె వేసినట్లుగా కనిపిస్తోంది.
వైసీపీ , బీఆర్ఎస్ ల మధ్య స్నేహపూర్వక వాతావరణం ఉన్నది. రెండు పార్టీల టార్గెట్ చంద్రబాబును కొట్టడమే. కాబట్టి ఇరు పార్టీల మధ్య ప్రస్తుతం చెలరేగుతోన్న మాటల మంటలు వ్యూహాత్మకంగా జరుగుతున్నాయన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. పైగా.. ఎన్నడూ లేనిది ఏపీ మంత్రి సీదిరి అప్పలరాజు తెలంగాణ సర్కార్ పై నిప్పులు చెరిగారు. మరీ దారుణంగా కామెంట్స్ చేశారు. భావోద్వేగాలను రెచ్చగొట్టేలా ఆయన కామెంట్స్ ఉన్నాయి. కేసీఆర్ కుటుంబాన్ని తాగుబోతులుగా మాట్లాడారు. తిరుగుబోతులుగా, అవినీతిపరులుగా కూడా కామెంట్స్ చేశారు.
అంతకు మించి తెలంగాణ ప్రజలపై కూడా గట్టిగానే మాట్లాడారు. ‘తెలంగాణ వాళ్లకు బుర్ర తక్కువ’ అంటూ ఆయన చేసిన తీవ్ర వ్యాఖ్యలు తెలుగు రాష్ట్రాల్లో బిగ్ డిబేట్ గా మారాయి. రెండు రాష్ట్ర ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టి రాజకీయ పబ్బం గడుపుకోవాలనే ఆలోచనతో ఇరు పార్టీలు ఉన్నాయనే వాదనలు సర్వత్ర వ్యక్తం అవుతున్నాయి. ఎన్నికలు సమీపిస్తున్నందున్న ఇరు పార్టీలు వ్యూహాత్మకంగానే ఆ రెచ్చగొట్టే తరహ వ్యాఖ్యలు చేస్తున్నారని విశ్లేషిస్తున్నారు.
ఈ ఏడాది చివర్లో తెలంగాణ ఎన్నికలు, వచ్చే ఏడాదిలో ఏపీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని రెండు పార్టీలు పరస్పర ప్రయోజనం కోసం ప్రజల్లో భావోద్వేగాలను రెచ్చగొట్టేందుకు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అయితే.. ఏపీలో బీజేపీ, జనసేనతో జట్టు కట్టాలని చంద్రబాబు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదే జరిగితే తెలంగాణలోనూ బీజేపీకి ప్లస్ అవుతుంది. టీడీపీ – బీజేపీ పొత్తుతో బీఆర్ఎస్ కు మెజార్టీ సీట్లు వచ్చే అవకాశం తక్కువ ఉంటుందనేది బీఆర్ఎస్ నేతల ఆందోళన.
అలాగే చంద్రబాబు బీజేపీ పంచన చేరితే ఏపీలో జగన్ కు తీవ్ర ఇబ్బందులు తప్పవు. అందుకే వ్యూహాత్మకంగా రెండుపార్టీలు రాజకీయపరమైన విమర్శలు , ఆరోపణలు చేసుకుంటున్నాయని విశ్లేషణలు వెలువడుతున్నాయి.