కర్ణాటకలో కాంగ్రెస్ గెలవడం ఖాయమని సర్వే సంస్థలు తేల్చేస్తుండటంతో ప్రధాన పార్టీలకు చెందిన నేతలంతా కాంగ్రెస్ లో చేరేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఇందులో మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలే కాకుండా ప్రస్తుత ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సిలు కూడా ఉండటం గమనార్హం. కర్ణాటక కాంగ్రెస్ వశం అవుతుందని గ్రహించే బీజేపీ, జేడీఎస్ నుంచి కాంగ్రెస్ లోకి వలసలు కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. ఈ వలసలకు అడ్డుకట్ట వేసేందుకు బీజేపీ హైకమాండ్ రంగంలోకి దిగి నేతలతో మాట్లాడుతున్నా ఎవరూ వెనక్కి తగ్గడం లేదు. మునిగోపోయే నావలో ఉండటం మంచిది కాదనుకొని అగ్రనేతల సూచనలను, ఆఫర్లను సున్నితంగా తిరస్కరిస్తున్నారు.
ఇప్పటివరకు బీజేపీ నుంచి ఓ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, నలుగురు మాజీ ఎమ్మెల్యేలు, ఓ మాజీ ఎమ్మెల్సీ, మాజీ ఎంపీతోపాటు 14మంది సీనియర్ నేతలు కాంగ్రెస్ లో చేరారు. మొత్తంగా బీజేపీ నుంచి కాంగ్రెస్ లో చేరిన నేతలు 23మంది ఉండగా.. జేడీఎస్ నుంచి 19మంది నేతలు కాంగ్రెస్ లో చేరారు. వీరిలో ముగ్గురు ఎమ్మెల్యేలు, ఏడుగురు మాజీ ఎమ్మెల్యేలు, నలుగురు మాజీ ఎమ్మెల్సిలు ఐదుగురు సీనియర్ నేతలు ఉన్నారు. గత ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేసి స్వతంత్రులుగానే కొనసాగుతున్న ఇద్దరు ఎమ్మెల్యేలు, ఓ తటస్థ సీనియర్ నేత కాంగ్రెస్ లో చేరడంతో మొత్తంగా కాంగ్రెస్ లోకి 45మంది నేతలు చేరారు. ఈ పరిణామం కాంగ్రెస్ గెలుపు సంకేతంగా కనిపిస్తోందని అంటున్నారు కర్ణాటక రాజకీయ విశ్లేషకులు.
వరుసగా బయటకొస్తున్న సర్వే వివరాలతో కర్నాటకలో బీజేపీ శకం ముగిసినట్లేననేది స్పష్టం అవుతోంది. జనాలను ఏ మాత్రం బీజేపీ మెప్పించలేని విధంగా పాలన చేయడంతోపాటు పలువురు ఎమ్మెల్యేలు, మంత్రుల అవినీతి బాగోతాలు బయటకు రావడంతో బీజేపీ సర్కార్ పై అక్కడి ప్రజలకు నమ్మకం సన్నగిల్లింది. యడ్యురప్పను మార్చి బొమ్మైకు ముఖ్యమంత్రి పగ్గాలు అప్పగించినా ఆయన పాలన కూడా జనాలను అట్రాక్ట్ చేయలేదు. వెరసి కమలం కర్ణాటకలో వాడిపోయే స్థితికి చేరుకుంది. బీజేపీ ఓటమిని ముందే పసిగట్టిన నేతలు కాంగ్రెస్ లో చేరేందుకు పెద్దమొత్తంలో ఆసక్తి చూపుతున్నారు. ఎన్నికలకు సమయం మరింత దగ్గర పడిన నేపథ్యంలో కాంగ్రెస్ లోకి చేరికలు మరింత పెరిగే అవకాశం ఉంది.
Also Read : నాలుగు జిల్లాలో బీఆర్ఎస్ ఖేల్ ఖతం…డేంజర్ జోన్ లో ఆ మంత్రులు..!?