విశాఖ ఉక్కును ప్రైవేట్ పరం చేయడం ఖాయమైందని ప్రచారం జరుగుతోన్న వేళ ఓ బిడ్ లో పాల్గొనాలని తెలంగాణ సర్కార్ తీసుకున్న నిర్ణయం రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చకు దారితీసింది. తెలంగాణలో మూతపడిన పరిశ్రమలను వంద రోజుల్లో ప్రారంభిస్తామని ఉద్యమ సమయంలో హామీ ఇచ్చిన కేసీఆర్…తెలంగాణ ఏర్పాటు అనంతరం ఇక్కడి పరిశ్రమల పునఃప్రారంభానికి ఎలాంటి కార్యాచరణ తీసుకోకపోగా ఏపీలోని విశాఖ ఉక్కు బిడ్ లో పాల్గొనాలని నిర్ణయం తీసుకోవడం ఖచ్చితంగా రాజకీయ వ్యూహమేనని తెలుస్తోంది.
వాస్తవానికి బిడ్ పొందాలనే ఆలోచన కేసీఆర్ కు ఏమాత్రం లేదని… ఆ బిడ్ లో పాల్గొని కేంద్రంపై తాము పోరాడుతున్నట్లు సంకేతాలు ఇవ్వాలనేది తెలంగాణ సర్కార్ వ్యూహంగా తెలుస్తోంది. ఇలా చేయడం వలన ఏపీ ప్రజలు ముఖ్యంగా విశాఖ ప్రజల మెప్పు పొందవచ్చునని.. అలాగే ఏపీ రాజకీయాల్లో బీఆర్ఎస్ పట్ల ఓ పాజిటివ్ వైబ్ ఉండేలా కేసీఆర్ వ్యూహాత్మక అడుగులు వేస్తున్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను కేంద్రం ప్రైవేట్ పరం చేయాలనీ చూస్తోందని.. తాము మాత్రం కాపాడేందుకు విశ్వప్రయత్నం చేస్తున్నామని చెప్పేలా బిడ్ లో పాల్గొని ఓ సందేశం పంపాలని కేసీఆర్ ఉవ్విళ్ళురుతున్నారు.
విశాఖ ఉక్కు విషయంలో కేసీఆర్ పోరాటం ఎలా ఉన్నా.. తెలంగాణ నుంచి మాత్రం కొన్ని ప్రశ్నలను ఎదుర్కోవాల్సిందే. బీఆర్ఎస్ వైఖరి పట్ల విమర్శలు రావడం సహజమే. ఎందుకంటే నిజాం షుగర్స్, ఆజంజాహీ మిల్లు, ఆల్విన్, ఐడీపీఎల్, హెచ్ఎంటీ, హెచ్‌సీఎల్ లాంటి కంపెనీలు ఇంకా మూతబడే ఉన్నాయి. వీటిని తెరిచేందుకు కేంద్రంతో సంబంధం లేకుండా కృషి చేస్తానని చెప్పిన కేసీఆర్.. ఇప్పుడు కేంద్రంపై ఆ నెపాన్ని వేసి పక్క రాష్ట్రమైన ఏపీలో విశాఖ ఉక్కు విషయంలో తెగ ఇంట్రెస్ట్ చూపడం పట్ల తెలంగాణ నుంచి ఆగ్రహం సహజంగానే వ్యక్తం అవుతోంది.
ఇక్కడ కేసీఆర్ పణంగా పెడుతోంది తెలంగాణ ప్రజల సొమ్ము. ఆ బిడ్ వస్తుందా రాదా అనేది అటుంచితే… వస్తే మాత్రం ఖచ్చితంగా వదిలించుకోలేని పరిస్థితి ఎదురవుతుంది. తెలంగాణలో ఎన్నో మూతపడిన పరిశ్రమలు ఉండగా ఎక్కడో విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి ఎందుకు కేసీఆర్ కంగారు పడుతున్నారనే ప్రశ్నలు తెరమీదకు వస్తున్నాయి. ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడటమే మా ప్రయత్నమని బీఆర్ఎస్ నేతలు ఎన్ని మాటలు చెప్పినా వారి మాటలను తెలంగాణ ప్రజలు విశ్వసించే అవకాశం లేదన్నది సుస్పష్టం.