బీజేపీ రాష్ట్ర అద్యక్షుడు బండి సంజయ్ ఫోన్ మిస్సింగ్ వ్యవహారం తీవ్ర దుమారం రేపుతోంది. ఇటీవల పేపర్ లీక్ కేసులో ఆయనను అరెస్ట్ చేసే సమయంలో ఫోన్ చూస్తూనే కనిపించారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలన్నీ మీడియాలో ప్రసారం అయ్యాయి. కానీ సంజయ్ మాత్రం తన ఫోన్ మిస్ అయిందని కంప్లైంట్ ఇచ్చారు.
అటు పోలీసులు బండి సంజయ్ తన ఫోన్ ఇవ్వాలని కోరినా ఇవ్వలేదని ప్రకటించగా.. బండి సంజయ్ మాత్రం తన ఫోన్ పోయిందని ఫిర్యాదు చేయడం సర్వత్రా చర్చనీయంశం అవుతోంది. వాస్తవానికి ఎవరినైనా అరెస్ట్ చేయాలనుకుంటే ముందుగా వారి ఫోన్ స్వాధీనం చేసుకుంటారు. బండి సంజయ్ విషయంలోనూ అలాగే చేశారా..? అనేది క్లారిటీ లేదు.
పేపర్ లీక్ కేసులో బండి సంజయ్ ఫోన్ బయటకొస్తేనే చిక్కుముడి వీడుతుంది. ఎందుకంటే పేపర్ లీక్ నిందితుడు ప్రశాంత్ , బండి సంజయ్ తో హిందీ పేపర్ లీక్ అయిన ముందు రోజే మాట్లాడాడని స్పష్టం చేశారు పోలీసులు. అలాంటప్పుడు బండి సంజయ్ అరెస్ట్ సమయంలో పోలీసులు ఆయన ఫోన్ స్వాధీనం చేసుకోకుండా ఉంటారా..? అనేది అందరి అనుమానం.
పోలిసులే తన ఫోన్ దాచిపెట్టారని బండి సంజయ్ ఆరోపిస్తుండగా…సంజయ్ ఫోన్ ను పోలీసులకు ఇవ్వలేదని వరంగల్ సీపీ చెప్పారు. అయితే , తన ఫోన్ లో చాలా వివరాలు, సీక్రెట్స్ ఉన్నాయని బండి సంజయ్ అంటున్నారు. బీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలు తనతో మాట్లాడారని, అది చూసి కేసీఆర్ కు షాక్ వచ్చినట్లుందని చెప్పుకొచ్చారు.
ఈ విషయాలను పక్కనపెడితే ఈ కేసులో బండి సంజయ్ ఫోన్ కీలక ఆధారం. కానీ ఈ ఫోన్ విషయంలో పోలీసులు ఓ వాదన వినిపిస్తుండగా సంజయ్ మరో వాదన వినిపిస్తుండటంతో ఈ కేసు కొత్త , కొత్త సందేహాలకు కారణం అవుతోంది.