ఎన్నికల సమయం సమీపిస్తోన్న వేళ నేతలంతా అప్పుడే ఎన్నికలపై దృష్టిసారిస్తున్నారు. అయితే వైసీపీ తరుఫున గెలిచిన ఎంపీలో చాలామంది ఈసారి ఎమ్మెల్యే అయ్యేందుకు ప్రణాళికలు రూపొందించుకుంటున్నారు. కొంతమంది ఎంపీలు అప్పుడే సిట్టింగ్ లతో సంబంధం లేకుండా అసెంబ్లీ నియోజకవర్గాల్లో పర్యటిస్తూ ఎమ్మెల్యేలకు మంట పుట్టిస్తుండగా మరికొంతమంది ఎంపీలు జగన్ వద్ద లాబియింగ్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
మొత్తం 21 మంది వైసీపీ ఎంపీల్లో దాదాపగా 11 మంది ఎమ్మెల్యే అభ్యర్థులుగా బరిలోకి దిగాలని కసరత్తు చేస్తున్నారు. కాకినాడ ఎంపీ వంగా గీత పిఠాపురం నుంచి పోటీ చేయలని ప్రయత్నిస్తున్నారు. పిఠాపురం నియోజకవర్గ ప్రజల దృష్టిని ఆకర్షించేందుకు ఆమె తన ఎంపీ ల్యాండ్స్ ను పిఠాపురం నియోజకవర్గానికి ఎక్కువగా కేటాయిస్తున్నారు. దీంతో సిట్టింగ్ ఎమ్మెల్యే దొరబాబుకు ఆమెకు మధ్య అంతర్గత పోరు నడుస్తున్నట్లు తెలుస్తోంది. అరకు ఎంపీ మాధవి పాడేరు అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేయాలని భావిస్తున్నారు.
రాజమహేంద్రవరం ఎంపీ మార్గాని భరత్ కుమార్ కూడా అసెంబ్లీలోకి వెళ్లాలని ఆరాటపడుతున్నారు. ఇందుకోసం ఆయన రాజమహేంద్రవరం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలనుకుంటున్నారు. జగన్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. అమలాపురం ఎంపీ చింతా అనురాధ రాజోలు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలనుకుంటున్నారు. కాగా తనకు రాజోలు, పి. గన్నవరం, అమలాపురంలో ఏ ఒక్కటి కేటాయించినా ఒకే నని ఆప్షన్స్ పెడుతున్నారు.
ఏలూరు ఎంపీ కోటగిరి శ్రీధర్ నూజివీడు అసెంబ్లీ స్థానం మీద కన్నేయగా విశాఖ ఎంపీ సత్యానారాయణ విశాఖ తూర్పు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని చూస్తున్నారు. అనంతపురం ఎంపీ తలారి రంగయ్యను ఉరవకొండకు పంపాలని జగన్ భావిస్తుంటే.. ఆయన మాత్రం కల్యాణదుర్గం నుంచి పోటీ చేసే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. నెల్లూరు ఎంపీగా ఉన్న ఆదాల చూపు నెల్లూరు రూరల్ నుంచి పోటీ చేయడం లాంచనమే. తిరుపతి ఎంపీ డాక్టర్ గురుమూర్తిని వచ్చే ఎన్నికల్లో గూడూరు అసెంబ్లీకి పంపాలన్నది జగన్ చూస్తున్నట్లు తెలుస్తోంది.
Also Read :వైసీపీలో కలకలం రేపుతోన్న ఆదోని ఎమ్మెల్యే వ్యాఖ్యలు