పదో తరగతి హిందీ పేపర్ లీక్ వ్యవహారం రాజకీయ రంగు పులుముకోవడంతో ఓ విద్యార్థి జీవితం ప్రశ్నార్థకంగా మారింది. పేపర్ లీక్ కు సంబంధించిన రాజకీయ కుట్రలో ఏమాత్రం సంబంధం లేని ఓ విద్యార్థి బీఆర్ఎస్ – బీజేపీ రాజకీయాలకు బలి అయినట్లు తెలుస్తోంది.
రెండు పార్టీల రాజకీయ ఎత్తుగడలో ఏమాత్రం సంబంధం లేని పదిహేనేళ్ళ కుర్రాడు పరీక్షలు రాసే అర్హత కోల్పోయాడన్న వాదనలు సర్వత్రా వ్యక్తం అవుతున్నాయి. కమలాపూర్ లోని పదో తరగతి పరీక్షా కేంద్రంలో పరీక్ష రాస్తోన్న హరీష్ అనే విద్యార్ధిని బెదిరించి ఓ వ్యక్తి హిందీ పేపర్ ఫోటో తీసుకున్నాడు. క్వశ్చన్ పేపర్ ఇచ్చేందుకు మొదట హరీష్ నిరాకరించి, ఇన్విజిలేటర్ కు చెప్తానన్నాడు. ఎవరికైనా చెప్తే ఇక్కడే చంపేస్తానని బెదిరించి ప్రశ్నాపత్రం ఫోటో తీసుకొని దానిని వాట్సప్ లో వైరల్ చేశారు. ఆ తరువాత అది ప్రశాంత్ అనే మాజీ జర్నలిస్ట్ నుంచి బండి సంజయ్ కు చేరింది. అయితే…హిందీ పరీక్ష జరిగే ముందు రోజునే బండి సంజయ్ హిందీ పేపర్ లీక్ కుట్రకు సంబంధించి వాట్సప్ లో ప్రశాంత్ తో చాట్ చేశాడని తేలినా… ఈ కుట్రకోణంలో ఎలాంటి ప్రమేయం లేని పదో తరగతి విద్యార్ధి హరీష్ బలి పశువు అయ్యాడన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి.
ఇందులో ఆ అమాయకుడైన హరీష్ అనే విద్యార్ధికి ఎటువంటి సంబంధం లేదంటున్నారు. పైగా ఇది పరీక్షల నిర్వహణపై సర్కార్ నిర్లక్ష్యాన్ని ఎత్తిచూపేలా ఉందనే అభిప్రాయాలు వినిపించాయి. ఎందుకంటే ఎగ్జామ్ జరిగే ఏరియాలో ఇతరులు సంచరించకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాల్సిన ప్రభుత్వం ఆ దిశగా ఏర్పాట్లు చేయకపోవడంతో… అందరి కళ్ళుగప్పి ఎగ్జాం రాస్తోన్న హరీష్ ను బెదిరించి హిందీ పేపర్ ను ఫోటో తీసుకున్నాడు ఆగంతకుడు. ఇది పరీక్షల నిర్వహణపై సర్కార్ కు తప్పిన నియంత్రణకు ఉదాహరణ అని అభిప్రాయపడుతున్నారు.
పేపర్ లీక్ ప్రభుత్వానికి తలవంపులు తీసుకురావడంతో విద్యాశాఖ అధికారులపై సర్కార్ ఆగ్రహం వ్యక్తం చేసింది. అదే సమయంలో బండి సంజయ్ ఈ ఇష్యూను రాజకీయంగా వాడుకోవాలని చూడటంతో ఈ వ్యవహారం సర్కార్ ను మరింత ఇరకాటంలో పడేసింది. దీంతో సర్కార్ ఆగ్రహానికి గురి అయిన అధికారులు హరీష్ ను ఐదేళ్ళపాటు డిబార్ చేశారు. ఫలితంగా ఐదేళ్ళపాటు పదో తరగతి పరీక్షలు రాసే అర్హతను కోల్పోయాడు హరీష్. పరీక్షలపై సర్కార్ కు తప్పిన పట్టుకు తోడు పేపర్ లీక్ తో సర్కార్ ను అభాసుపాలు చేయాలనే బండి సంజయ్ రాజకీయ కుట్రకు పదో తరగతి విద్యార్ధి జీవితం బలైందని విశ్లేషిస్తున్నారు. ఈ కుట్ర రచన చేశాడని ఆరోపణలు ఎదుర్కొంటున్న బండి సంజయ్ బెయిల్ పై విడుదలై బయటకొచ్చాడు కానీ ఏమాత్రం రాజకీయం తెలియని హరీష్ స్టూడెంట్ లైఫ్ రిస్క్ లోనే పడింది.
రాజకీయాలతో ఏమత్రం సంబంధం లేని హరీష్ ను పరీక్షలను రాయకుండా నిరాకరించాడని సవాల్ చేస్తూ NSUI రాష్ట్ర అద్యక్షుడు బల్మూరి వెంకట్ హైకోర్టులో హౌజ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై కోర్టు ఎలా స్పందిస్తుందో చూడాలి.
HOUSE MOTION
Before Hon’ble Justice K Laxaman
WP SR No. 13758 of 2023
Filed by Dr.Balmoori Venkat Rao NSUI President Telangana State to allow SSC student Dandaboina Harish to appear & write the remaining examinations