బీహార్ లో జన సురాజ్ పార్టీ ఏర్పాటు చేసిన రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ పార్టీకి అప్పుడే తొలి విజయం దక్కింది. అయితే అది నేరుగా గెలిచింది కాదు. ఆ పార్టీ మద్దతుతో ఎమ్మెల్సీ అభ్యర్థి గెలుపొందారు. బీహార్ లో జరిగిన ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అఫాక్ అహ్మద్ అనే అభ్యర్థికి ప్రశాంత్ కిషోర్ మద్దతు ప్రకటించారు. స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగిన అహ్మద్ జన సురాజ్ పార్టీ మద్దతుతో ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. దీంతో చట్టసభల్లో జన సురాజ్ పార్టీ పరోక్షంగా ఎంటర్ అయినట్లు అయింది.
ఎన్నికల స్ట్రాటజిస్ట్ అయిన ప్రశాంత్ కిషోర్ కు ఎన్నికల్లో ఎలా గెలుపొందాలో బాగా తెలుసు. కాబట్టి ఆయన వ్యూహలతోనే ఎమ్మెల్సీ ఎన్నికల్లో అహ్మద్ అనే స్వతంత్ర అభ్యర్థి గెలిచి ఉండొచ్చననే అభిప్రాయం వినిపిస్తోంది. ఇది జన సురాజ్ పార్టీ గెలుపు కాకపోవచ్చు కానీ ఆ పార్టీ మద్దతుతో గెలుపొందటమంటే అభ్యర్థి సాధించిన విజయంలో మద్దతు పలికిన పార్టీకి కూడా క్రెడిట్ వెళ్తుంది. దాంతో అహ్మద్ గెలుపును జన సురాజ్ పార్టీకి దక్కిన మొదటి విజయంగా ప్రచారం చేసుకుంటున్నారు.
వచ్చే ఎన్నికల్లో జన సురాజ్ పార్టీ పేరుతో బీహార్ లో పోటీ చేయనున్నారు ప్రశాంత్ కిషోర్. అభ్యర్థుల ఎంపిక కూడా కొనసాగుతుంది. అయితే ఆయన పార్టీ బీజేపీ బీ టీమ్ అనే ఆరోపణలు ఉన్నాయి. ప్రశాంత్ కిషోర్ పదేపదే నితీష్ కుమార్ ను టార్గెట్ చేస్తున్నారు తప్పితే బీజేపీని పల్లెత్తు మాట అనడం లేదు. దాంతో ఆయన పార్టీ బీజేపీకి బీ – టీం అనే ఆరోపణలకు బలం చేకూరుతోంది.
పొలిటికల్ స్ట్రాటజిస్ట్ గా రాజకీయాల్లోకి వచ్చిన ప్రశాంత్ కిషోర్ రాజకీయ మొదట జేడీయూలో చేరారు. ఆ పార్టీలో ఆయనకు కీలకమైన పదవిని కట్టబెట్టారు. ఉపాధ్యక్ష పదవి అప్పగించారు. కానీ నితీష్ కుమార్ రాజకీయాలను తట్టుకోలేక బయటకు వచ్చి వ్యూహకర్త పాత్ర మళ్ళీ పోషించారు. ఇప్పుడు జన సురాజ్ పార్టీతో బీహార్ లో రాజకీయంగా రాణించాలని అనుకుంటున్నారు. ఇందుకోసం బీహార్ అంతటా పాదయాత్ర చేసి ప్రజలకు దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు.
Also Read : ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్ లో చేరక పోవడానికి కెసిఆర్ జాతీయ రాజకీయాలకు ఉన్న సంబంధం ఎంటి ?